తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నానాటికీ బలహీన పడుతోందా? అదే సమయంలో తెలంగాణలో బిజెపి రోజురోజుకూ బలపడుతోందా? తెలంగాణ కాంగ్రెస్ లోని కీలక నేతలంతా ఒక్కొక్కరిగా పార్టీని వీడడానికి కాంగ్రెస్ అధిష్టానం తీరే కారణమా? కొద్దో గొప్పో అసంతృప్తితో ఉన్న టీకాంగ్రెస్ నేతలను తమ వైపు తిప్పుకోవడంలో తెలంగాణ బీజేపీ, బీజేపీ అగ్రనేతలు సఫలమవుతున్నారా? అన్న ప్రశ్నలకు తెలంగాణ రాజకీయ విశ్లేషకులు అవును అనే సమాధానం ఇస్తున్నారు.
దేశంలోనే గ్రాండ్ ఓల్డ్ ట్రంక్ పార్టీగా పేరున్న కాంగ్రెస్ పూర్వ వైభవం తెచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్న నేపథ్యంలోనే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరిగా కాషాయ కండువా కప్పుకోవడం సంచలనం రేపుతోంది. ఇప్పటికే డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి పలువురు కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో తాజాగా మరో కాంగ్రెస్ నేత బిజెపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పేరున్న మర్రి శశిధర్ రెడ్డి బిజెపిలో చేరడం దాదాపుగా ఖాయమని ప్రచారం జరుగుతోంది. బిజెపి నేత డీకే అరుణతో కలిసి ఈ రోజు ఆయన ఢిల్లీకి వెళ్లారని, నేడో రేపో ఆయన పార్టీ మారబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై శశిథర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం కూడా ఈ పుకార్లకు ఊతమిస్తోంది. కాంగ్రెస్ లో లుకలుకలకు రేవంత్ రెడ్డే కారణమని, ఆయన పనులు కాంగ్రెస్ కు తీరని నష్టం చేకూరుస్తున్నాయని శశిధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణికం ఠాగూర్ ఏజెంట్ గా పనిచేస్తున్నారని కూడా శశిధర్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. చాలాకాలంపాటు దివంగత నేత పి.జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డిలు హైదరాబాద్ బ్రదర్స్ గా, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులుగా తెలంగాణ రాజకీయాల్లో ఖ్యాతి గడించారు, అటువంటి నేత శశిథర్ రెడ్డి కూడా బిజెపిలోకి వెళ్లాలకోవడం కచ్చితంగా కాంగ్రెస్ వైఫల్యమేనని విమర్శలు వస్తున్నాయి. అయితే, ఈ పుకార్లను శశిధర్ కొట్టిపారేశారు. మనవడి స్కూల్ ఫంక్షన్ కోసం ఢిల్లీ వచ్చానని, తాను వచ్చిన విమానంలో డీకే అరుణ కూడా ఉన్నారని, అంత మాత్రాన బీజేపీలో చేరుతున్నానని ప్రచారం చేయడం సరికాదని అన్నారు.