మర్రి చెన్నారెడ్డి. నేటి తరానికి పెద్దగా పరిచయం లేని పేరనే చెప్పాలి. కానీ, 1990ల వరకు మర్రి చెన్నారె డ్డిని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను విడదీసి చూడలేని పరిస్థితి. అంతగా రాజకీయాలపై తన ముద్ర వేసుకున్నారు మర్రి చెన్నారెడ్డి. ముఖ్యమంత్రిగా ఆయన పరిచయం ఎక్కువ మందికి ఉన్నా.. దీనికి ముందు ఆయన అనేక రూపాల్లో రాజకీయంగా కేంద్రానికి పరిచయమే కాదు, ప్రాధాన్యమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
ప్రధానంగా గాంధీల కుటుంబంతో చెన్నారెడ్డి పెనవేసుకున్న బంధం అంతా ఇంతా కాదు. ఇందిరమ్మ సమయంలో కాంగ్రెస్లో చీలిక వచ్చినప్పుడు, తన సొంత సామాజిక వర్గమే ఇందిరమ్మను వదిలేసి పక్కకు వెళ్లినా.. మర్చి చెన్నారెడ్డి మాత్రం ఇందిరమ్మ అడుగు జాడల్లో నడిచారు. ఆమెదే నిజమైన కాంగ్రెస్ అని ఊరూవాడా ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీ మనసు దోచుకున్నారు చెన్నారెడ్డి. తర్వాత ఎప్పుడు అవసరం ఉన్నా, ఏ చిన్న సలహాకైనా మర్రి పేరు ప్రధానంగా వినిపించేది.
ఉమ్మడి ఏపీలో ఇందిరమ్మ పర్యటించాల్సి వస్తే మర్రి చెన్నారెడ్డి ఉండాల్సిందే. అలాగని, కొన్ని కొన్ని సార్లు గాంధీల కుటుంబం చెన్నారెడ్డికి షాక్ ఇచ్చిన సందర్భాలు పదవి నుంచి దింపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా, ఎక్కడా ఆయన హర్ట్కాలేదు. పార్టీలోనే ఉన్నారు. చివరి శ్వాస వరకు చెన్నారెడ్డి కాంగ్రెస్ వాదిగానే బతికారు. పదవుల కోసం ఆయన వెంపర్లాడకపోవడం గమనార్హం.
కట్ చేస్తే..
అంతగా గాంధీల కుటుంబంతో బంధం వేసుకున్న మర్రి కుటుంబంలో నేడు కలకలం రేగింది. కమలం రాజకీయ వ్యూహాలకు చిక్కిన మర్రి చెన్నారెడ్డి కుమారుడు శశిధర్రెడ్డి బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయపార్టీ పరిశీలకురాలు డీకే అరుణతో కలిసి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవడం తెలిసిందే.
అయితే, ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్తో బంధం పెనవేసుకున్న కుటుంబం.. చెన్నారెడ్డి సంపాయించుకున్న పరువు, గౌరవ మర్యాదలు అన్నీ కూడా శశిధర్రెడ్డి మరిచిపోయారనే వాదన చెన్నారెడ్డి అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఏం.. ఇంకేం అనుభవిస్తారు? అనే ప్రశ్న కూడా వస్తోంది. గతంలో శశికి కూడా మంత్రి పదవి ఇచ్చారు. కేంద్రంలోనూ చక్రం తిప్పారు. అయినా.. పదవీ కాంక్ష కోసం చేసిన తాజా ప్రయత్నంతో చెన్నారెడ్డి ఆత్మ ఘోషించడం ఆయనకు వినిపించడం లేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.