ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత వైసీపీ నేతలు యథేచ్ఛగా సహజ, ఖనిజ సంపదను దోచుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నం మన్యం ప్రాంతంలో లేటరైట్ మైనింగ్ పేరుతో బాక్సైట్ అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆధారలతో సహా బట్టబయలు చేశారు. అంతేకాదు, ఆ ప్రాంతంలోకి ఎవరూ రాకూడదని, అక్కడ ఫొటోలు, వీడియోలు తీయకూడదని బెదిరిస్తూ హెచ్చరిక బోర్డులు కూడా పెట్టారు.
రూ.15 వేల కోట్ల విలువైన బాక్సైట్ కోసం వైసీపీ మైనింగ్ మాఫియా అడవిని నాశనం చేసిందని టీడీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. ఆ బాక్సైట్ కోసం వైసీపీ మైనింగ్ మాఫియా ఎంత అడవిని నాశనం చేసిందో గూగుల్ శాటిలైట్ ఫోటోలతో సహా బయటపెట్టడం గతంలో సంచలనం రేపింది. ఎన్ని ఆధారాలు చూపించినా ఫలితం లేకపోయింది. ఇక, ఈ వ్యవహారంపై గత ఏడాది మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ కూడా క్లారిటీ ఇచ్చారు. అక్కడంతా లాటరైట్ మైనింగ్ జరుగుతోందని ప్రెస్ మీట్ పెట్టి తేల్చేశారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ మహిళా నేత, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. లేటరైట్ మైనింగ్ ముసుగులో బాక్సైట్ అక్రమ తవ్వకాలను భాగ్యలక్ష్మి ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ లేఖ రాశారు. విశాఖ మన్యంలోని జీకే వీధి మండలం చాపరాతిపాలెంలో జరుగుతున్న మైనింగ్ ను ఆపేయాలని హెచ్చరించారు. అంతేకాదు, ఎమ్మెల్యే తక్షణమే తన పదవికి రాజీనామా చేసి, మన్యం ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని తేల్చి చెప్పారు.
ఒకవేళ, తమ హెచ్చరికను పట్టించుకోకపోతే సివేరి సోమ, కిడారి సర్వేశ్వరరావుల తరహాలోనే ప్రజాకోర్టులో ప్రజలు శిక్షిస్తారని వార్నింగ్ ఇచ్చారు. మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరుతో ఈ లేఖ విడుదలయింది. మరి, ఈ వ్యవహారంపై భాగ్యలక్ష్మి,వైసీపీ నేతల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.