ఏపీ సీఎం జగన్ పాలనలో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని, ఓ పక్క సంక్షేమ పథకాలంటూ మరో పక్క పన్నులతో జగన్ జనం నడ్డి విరుస్తున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని మోడీ సర్కార్ కు జగన్ అనుకూలంగా ఉన్నారని, ఈ క్రమంలోనే ప్రత్యేక హోదా అంశాన్ని గాలికి వదిలేశారని విమర్శిస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యవహారంలోనూ జగన్ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ పై మావోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషన్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ రెండేళ్ల పాలనపై గణేష్ మండిపడ్డారు. గణేశ్ పేరుతో మీడియాకు ఒక లేఖ విడుదల చేశారు. రెండేళ్ల పాలనలో ప్రజలకు జగన్ ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. తనపై ఉన్న అవినీతి కేసులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రానికి జగన్ తలొగ్గి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు.
జగన్ చెప్పినట్లు ఏపీకి హోదా రాలేదని, రాష్ట్ర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని గణేశ్ విమర్శించారు. ప్రజలను పక్కదారి పట్టించేందుకే 3 రాజధానుల అంశాన్ని జగన్ తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అమలుచేస్తున్న కేంద్రం…ప్రజాస్వామిక వాదులు, లౌకిక వాదులపై రాజద్రోహం కేసులు పెడుతోందని, దానికి జగన్ మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు.
నవరత్నాలతో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కావని, అమ్మఒడి, ఆరోగ్ర శ్రీ వంటి పథకాలతో కార్పొరేట్ సంస్థలకు లాభాలను చేకూర్చడమేనని విమర్శించారు. మరి, ఈ లేఖపై జగన్ ఏవిధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.