తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు బయలుదేరిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. తన కుటుంబంతో కలిసి తిరుపతికి వెళ్తూ మార్గమధ్యంలో అల్పాహారం కోసం ఒంగోలులోని ఓ హోటల్ దగ్గర ఆగిన అతడికి పోలీసులు షాకిచ్చారు. హఠాత్తుగా హోటల్ ముందు ప్రత్యక్షమైన ఓ కానిస్టేబుల్ తన ఇన్నోవా కారును తీసుకువెళ్లడంతో అతడు అవాక్కయ్యాడు. తన దగ్గర కారుకు సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నా సరే పోలీసులు తన వాహనాన్ని ఎందుకు తీసుకు వెళుతున్నారో అతడికి అర్థం కాలేదు.
కారు తీసుకువెళ్లిన కొద్ది సేపటి తర్వాత మరో పోలీసు వచ్చి అసలు విషయం చెప్పడంతో ఆ కుటుంబానికి మైండ్ బ్లాక్ అయింది. సీఎం కాన్వాయ్ కోసం ఆ కారును తీసుకువెళ్లామని పోలీసులు చెప్పడంతో ఆ కారు ఓనర్ షాకయ్యాడు. ఈ ఘటనపై విస్మయం వ్యక్తం చేస్తూ అసహనం వ్యక్తం చేశాడు. తాము హోటల్ లో టిఫిన్ చేస్తుండగా ఓ కానిస్టేబుల్ వచ్చి సీఎం కాన్వాయ్ కోసం వాహనంతో పాటు డ్రైవర్‌ను ఇవ్వాలని డిమాండ్ చేశారని వాపోయారు. తాము కుటుంబంతో తిరుమలకు వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారుల ఆదేశాలు తాము పాటిస్తున్నామని, సారీ చెప్పడం తప్ప మేమేమీ చేయలేమంటూ కారుతో పాటు డ్రైవర్‌ను కూడా ఆ కానిస్టేబుల్ తీసుకు వెళ్లిపోయాడని కారు ఓనర్ వాపోయాడు. సీఎం కాన్వాయ్‌కు వాహనాలు కావాలంటే స్థానికులను అడిగి తీసుకోవాలనీ, కానీ, దూరప్రాంతాల నుంచి ప్రయాణం చేస్తున్న వారి కారును తీసుకువెళ్లడం ఏమిటని అతడు అసహనం వ్యక్తం చేస్తున్నాడు.
తాము మొక్కులు తీర్చుకునేందుకు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నామని, అటువంటి వారి వాహనాలు లాక్కుని తమను నడిరోడ్డుపాలు చేయడం ఏమిటని ఆ కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఊరుకాని ఊళ్లో తమకు ఇప్పటికిప్పుడు తిరుమల వెళ్లేందుకు వాహనం ఎక్కడ దొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వస్థలానికి వెళ్లేందుకు కూడా వాహనం దొరికే పరిస్థితి లేదని వాపతున్నారు. ఈ నెల 22న సీఎం జగన్ ఒంగోలు పర్యటన నేపథ్యంలో సామాన్యులు ఇలా బలయ్యారని విమర్శలు వస్తున్నాయి.