ఏపీ అధికార పార్టీ వైసీపీలో మేనిఫెస్టో గుబులు పట్టుకుందా? వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రజలకు ఎలాంటి హామీలు గుప్పించాలనే విషయంపై కీలక నేతల మధ్య చర్చోపచర్చలు జరుగుతున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇప్పటికే మినీ మేనిఫెస్టో విడుదల చేసింది. దీనికి అనుబంధంగా కీలకమైన ప్రధాన మేనిఫెస్టోను కూడా టీడీపీ రెడీ చేస్తోంది.
టీడీపీ మేనిఫెస్టోను గమనిస్తే.. అనేక పథకాలకు సంబంధించి బలమైన హామీలను గుప్పించింది. అమ్మ ఒడి వంటి ప్రస్తుతం జగన్ సర్కారు అమలు చేస్తున్న పథకం నిధులను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లకూ ఇస్తామని టీడీపీ గ్రామ గ్రామాన ప్రచారం చేస్తోంది. అదేసమయంలో ఇతర పథకాల ద్వారా కూడా మహిళ లను ఆకట్టుకుంటోంది. ఇక, ఎన్నికల సమయానికి విడుదల చేసే మేనిఫెస్టోలో విజన్-2047 హామీ ప్రధానంగా ఉండనుంది.
తద్వారా.. చదువుకున్న నిరుద్యోగులు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులను టీడీపీ తనవైపు తిప్పుకొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఈ పరిణామాలను గమనిస్తున్న వైసీపీ.. నవరత్నాల కాన్సెప్టులో మార్పులు చేర్పులు చేసేందుకు సమాయత్తమైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నా యి. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలంటే.. మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని తాడేపల్లి మేధావులు లెక్కలు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే 2014, 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలను తాజాగా అధ్యయనం చేసి.. మరో నూతన మేనిఫెస్టో ను రూపొందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే.. ప్రత్యేకంగా రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రజల మూడ్ ఎలా ఉంది? ఏం కోరుకుంటున్నారు? వారి నుంచి ఫీడ్ బ్యాక్ విషయంలో వస్తున్న సంగతులు ఏంటి? అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని.. దాని ప్రకారం మేనిపెస్టోను రెడీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.