తన సొంత నియోజకవర్గం మంగళగిరిపై మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. 90 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో తనను గెలిపించారని.. మంగళగిరి ప్రలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. `మీ ఇల్లు-మీ లోకేష్` కార్యక్రమంలో భాగంగా.. శుక్రవారం పలువురికి ఇంటి పట్టాలు అందించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి భావోద్వేగంగా ప్రసంగించారు.
“మంగళగిరి కేవలం ఒక నియోజకవర్గం మాత్రమే కాదు. ఇది నా పుట్లిల్లు. భౌతికంగా నేను వేరే ప్రాంతంలో జన్మించినా.. రాజకీయంగా మాత్రం నాకు జన్మ ప్రసాదించింది.. ఈ నియోజకవర్గమే. ఈ నియోజకవర్గంతో నాకు.. రాజకీయ పేగు బంధం పెనవేసుకుపోయింది. 2019లో ఓడిపోయినప్పుడు.. ఎంతో బాధ పడ్డా. ఆ తర్వాత.. కొన్ని రోజులకు ఓడిపోయానన్న బాధను దిగమింగి.. ప్రజల కోసం.. మళ్లీ ఇక్కడకు వచ్చా. అప్పుడు నన్ను చూసి చాలా మంది బాధపడ్డారు. ఈ సారి తప్పకుండా గెలిపిస్తామని హామీ ఇచ్చారు. అదే నాకు రాజకీయంగా బూస్ట్ ఇచ్చింది“ అని నారా లోకేష్ అన్నారు.
“మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి గడపలోనూ నారా లోకేష్ పేరును తలుస్తున్నారు. వారికి నేను యువ గళం పాదయాత్ర సమయంలోనూ గత ఎన్నికల్లోనూ.. అనేక హామీలు ఇచ్చాను. వాటిని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నాను. చిన్న వ్యాపారులకు తోపుడు బళ్లు.. ఇస్త్రీ చేసుకునే వారికి పనిముట్లు, ఇతర వ్యాపారు లకు కూడా అనేక రూపాల్లో సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నా“ అని నారా లోకేష్ వివరించారు. సూపర్ సిక్స్ హామీలు.. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అమలైనట్టే.. అర్హులైన మంగళగిరి ప్రజలకు కూడా అమలవుతాయని చెప్పారు.
అయితే.. స్వయంగా కేవలం మంగళగిరి కోసం ఇచ్చిన కొన్ని హామీలు ఉన్నాయని లోకేష్ చెప్పారు. వీటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 13న 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి తానే స్వయంగా శంకుస్థాపన చేయనున్నట్టు మంత్రి తెలిపారు. వచ్చే ఏప్రిల్ 13న తానే తిరిగి ఆ ఆసుపత్రిని ప్రారంభిస్తానని.. అంత వేగంగా నాణ్యతతో పాటు అధునాతన సౌకర్యాలు ఉండేలా నిర్మాణం జరుగుతుం దన్నారు. మీ ఇల్లు-మీ లోకేష్ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో ఇంటి పట్టాలు ఇవ్వనున్నట్టు తెలిపారు.