ఒకప్పుడు రీమేక్ మూవీ అంటే చాలా సేఫ్ అన్నట్లుండేది. ఆల్రెడీ ఒక భాషలో విజయవంతం అయిన కథను ఇంకో భాషలోనూ తీసి సక్సెస్ చేయడం ఈజీ అన్నట్లుండేది. కానీ ఇంటర్నెట్, ఓటీటీ విప్లవం పుణ్యమా అని అందరూ అన్ని భాషల చిత్రాలనూ బాగా చూసేస్తున్న ఈ రోజుల్లో రీమేక్ మూవీ తీయడం చాలా రిస్క్ అయిపోయింది.
ఈ మధ్యే చిరంజీవి చేసిన రీమేక్ మూవీ ‘భోళా శంకర్’కు ఎంత ఘోరమైన రిజల్ట్ వచ్చిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో చాలామంది రీమేక్లంటేనే భయపడిపోతున్నారు. ఇలాంటి సమయంలో ‘మండేలా’ అనే తమిళ ప్రయోగాత్మక చిత్రాన్ని తెలుగులో ‘మార్టిన్ లూథర్ కింగ్’ పేరుతో రీమేక్ చేశారు. తమిళంలో స్టార్ కమెడియన్ యోగిబాబు హీరోగా మడోన్ అశ్విన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. యోగిబాబు గొప్పగా నటించి మెప్పించాడు లీడ్ రోల్లో.
‘మార్టిన్ లూథర్ కింగ్’ ఫస్ట్ లుక్‌ను చాలా ఇంట్రెస్టింగ్గా తీర్చిదిద్దిన టీం.. ఈ రోజు లాంచ్ చేసిన టీజర్‌తోనూ మెప్పించింది. ఒరిజినల్లో ఆత్మ చెడకుండా.. తెలుగు నేటివిటీకి తగ్గట్లు సినిమాను బాగా తీశారనే విషయం టీజర్ చూస్తే అర్థమవుతోంది. యోగిబాబును సంపూర్ణేష్ బాబు మ్యాచ్ చేయగలడా అన్న సందేహాలు కలిగాయి కానీ.. గత సినిమాల ఛాయలు కనిపించకుండా సటిల్‌గా ఈ పాత్రను చేసి మెప్పించాడు సంపూ.
పాత్రకు తగ్గట్లుగా అతడి నుంచి మంచి నటనే రాబట్టుకున్నట్లున్నారు. అతను ఈ పాత్రకు బాగా సూటయ్యాడు కూడా. కథలో కీలకమైన రెండు పాత్రల్లో నరేష్, వెంకటేష్ మహా కూడా బాగా కుదిరారు. మన నేటివిటీని ఈ కథలో జొప్పించడంలో టీం విజయవంతం అయింది. పూజా కొల్లూరు ఈ చిత్రాన్ని రూపొందించగా.. వెంకటేష్ మహా ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించాడు. టీజర్‌తో మంచి ఇంప్రెషన్ వేసిన ఈ చిత్రం.. అక్టోబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
MartinLutherKing, the Telugu remake of Mandela, directed by Puja Kolluru. Sampoornesh Babu gets his first bonafide dramatic role. Good vibes only.