టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని, చంద్రబాబు కుటుంబ సభ్యులను ఉద్దేశించి వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. రాజకీయం చేసే క్రమంలో రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని భువనేశ్వరిపై వైసీపీ నేతల దిగజారుడు వ్యాఖ్యలపై రజనీకాంత్ వంటి సినీ ప్రముఖులు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ నందమూరి కుటుంబానికి అండగా నిలుస్తున్నారు.
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు…మీడియా ముందు మొట్టమొదటిసారి కంటతడిపెట్టడంతో పలువురు విపక్ష పార్టీల నేతల గుండె సైతం తరుక్కుపోయింది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబుకు, భువనేశ్వరికి జరిగిన అవమానంపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పందించారు. ఈ ఘటనపై సీఎం జగన్ విచారం వ్యక్తం చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని దారుణంగా కించపరిచేలా వ్యాఖ్యానించిన ఎమ్మెల్యేలతో ఆమెకు బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు.
తమ వ్యాఖ్యలను వైసీపీ సభ్యులు సమర్థించుకుంటున్నారని, అలా అది నిజమే అయితే ఆనాటి అసెంబ్లీ రికార్డులను బహిరంగపరచాలని ఆయన కోరారు. పగలు, ప్రతీకారాలకు పోయి మరింత రెచ్చగొట్టేలా మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వానికే నష్టం చేకూరుస్తుందని మందకృష్ణ హితవు పలికారు. ఆమెకు క్షమాపణలు చెప్పిస్తే కొంతైనా ఊరట లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం వల్ల సీఎం జగన్ గౌరవం పెరుగుతుందని అన్నారు.
తప్పుగా మాట్లాడిన ఎమ్మెల్యేలపై జగన్ యాక్షన్ తీసుకున్నారన్న సంకేతం ప్రజల్లోకి వెళుతుందని, అలాంటి వారిని సీఎం క్షమించరనే గొప్ప సంకేతం సమాజానికి పంపిన వారవుతారని అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు విలపించిన తీరు తనను కలిచివేసిందని ఆయన అన్నారు. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, కానీ, వ్యక్తిత్వ హననం, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం తగదని హితవు పలికారు.