వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుమల లడ్డు నాణ్యత దెబ్బ తినడంపై ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది. గత నాలుగేళ్ల పాటు లడ్డుల ో వాడిన నెయ్యిలో జంతు కొవ్వుల అవశేషాలు ఉన్నట్లు కూటమి ప్రభుత్వం ఆరోపించడం.. అంతే కాక ఆ నెయ్యిని పరీక్షించిన ల్యాబ్ రిపోర్ట్స్‌ను బయటపెట్టడం సంచలనం రేపింది. తిరుమల శ్రీవారిని దేశవ్యాప్తంగా ఎంతో భక్తితో కొలిచే వాళ్లందరూ ఈ విషయం తెలిసి షాకవుతున్నారు.
రాజకీయంగా కూడా ఈ విషయం దుమారం రేపుతోంది. ఈ వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్.. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించిన సంగతి తెలిసిందే. దీనిపై సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. లడ్డు నాణ్యత విషయంలో వచ్చిన ఆరోపణలపై విచారణ చేయడం మీద దృష్టిపెడితే సరిపోతుందని.. అలా కాకుండా దీనికి మత రంగు పూసి జాతీయ వివాదంగా మార్చడమేంటన్నట్లు ఆయన మాట్లాడారు. దీంతో ప్రకాష్ రాజ్ మీద పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు హిందూ మద్దతుదారులు మండి పడుతున్నారు.
ఇంతలో ఈ గొడవలోకి ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు వచ్చాడు. ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ మీదే విష్ణు గెలిచిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల గురించి వీరి మధ్య విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో తాజా వివాదంలో ప్రకాష్ రాజ్ జోక్యాన్ని విష్ణు తప్పుబట్టాడు. ‘‘ప్రకాష్ రాజ్.. మీరు దయచేసి మరీ అంతలా నిరుత్సాహపడి అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డు కేవలం ప్రసాదం మాత్రమే కాదు.
నాలాంటి కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ కోరారు. ధర్మ పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటారు. ఇలాంటి వ్యవహారంలోకి మీలాంటి వారు వస్తే మతం రంగు పులుముకోకుండా ఉంటుందా. మీ పరిధిలో మీరు ఉండండి’’ అని విష్ణు ట్వీట్ చేశాడు.