మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నిక సమయంలో నానా రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు వర్సెస్ ప్రకాష్ రాజ్ వర్గాలుగా విడిపోయిన టాలీవుడ్…సాధారణ ఎన్నికలను తలపించేలా ఈ ఏడాది మా ఎన్నికలను నిర్వహించింది. ఎన్నికల సందర్భంగా ప్రకాష్ రాజ్ వర్గానికి చెందిన బెనర్జీపై మోహన్ బాబు చేయి చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఇక, మంచు విష్ణు వెనుక కొందరు రాజకీయ నేతల ప్రమేయం ఉందని, అందుకే ఆయన మా అధ్యక్షుడిగా గెలిచారని కూడా విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే మా అధ్యక్షుడిగా ఏడాదికాలం పూర్తి చేసుకున్న మంచు విష్ణు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా’కు వ్యతిరేకంగా కార్యవర్గ సభ్యులు, నటులు ధర్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, అలా చేసిన వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తామని కూడా విష్ణు హెచ్చరించారు. ఇక, ‘మా’కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా సరే వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు అవుతుందని విష్ణు స్పష్టం చేశారు.
తాను ‘మా’కు మాత్రమే కాకుండా ప్రేక్షకులకు కూడా జవాబుదారీగా ఉంటానని విష్ణు అన్నారు. తమ ప్యానెల్ ఇచ్చిన వాగ్దానాలలో తొంభై శాతం నెరవేర్చామని, కొత్త ఫిలిం ఛాంబర్ నిర్మాణ ఖర్చు తానే భరిస్తానని విష్ణు అన్నారు. ఈ సమావేశంలో నటుడు మోహన్ బాబు కూడా పాల్గొన్నారు. తాను ‘మా’ అధ్యక్షుడిగా గతంలో ఉన్నా..ఎన్నడూ మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదని అన్నారు. చేసిన మంచి పనులు చెప్పుకోవడం సొంత డబ్బా కొట్టుకోవడం కాదని చెప్పారు. విష్ణు చేసే పనుల్లో మోసం, దగా లేవని అన్నారు. ఏదేమైనా విమర్శిస్తే ‘మా’ సభ్యత్వం రద్దు చేస్తామని విష్ణు చేసిన కామెంట్లు టాలీవుడ్ లో కాక రేపుతున్నాయి.