మూవీ ఆర్టిస్ట్ర్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన మంచు విష్ణు.. క్రమంగా వాయిస్ పెంచుతున్నాడు. ముందుగా విష్ణు తన అభ్యర్థిత్వాన్ని వెల్లడిస్తూ.. సభ్యులను ఉద్దేశించి ఒక వీడియో రిలీజ్ చేయడం తెలిసిందే.
అందులో ఇండస్ట్రీ కోసం తమ కుటుంబం చేసిన మంచి పనుల గురించి చెప్పడమే కాక.. ‘మా’ కోసం స్థలం కేటాయిస్తే తన సొంత ఖర్చుతో భవనం కట్టి ఇస్తానని హామీ కూడా ఇచ్చాడు విష్ణు.
ఐతే తొలి దశలో ఇలా స్మూత్‌గా మాట్లాడిన విష్ణు.. ఇప్పుడు వివాదాలు, విమర్శల లైన్లోకి వచ్చాడు. ఇండస్ట్రీలో అంతర్గతంగా ఎదురవుతున్న విమర్శలు, మాటల దాడి నేపథ్యంలో అతను కొన్ని హెచ్చరికలు జారీ చేశాడు.
తమ గురించి ఎవరైనా శ్రుతి మించి మాట్లాడితే.. వారి పేర్లు వెల్లడించి వాళ్లేం చేశారో అంతా బయటపెట్టాల్సి ఉంటుందని విష్ణు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
‘‘ఇండస్ట్రీలో మేం ఎంతమందికి హెల్ప్ చేశామన్నది నేను చెప్పను. కొందరు ఊచలు లెక్కపెట్టకుండా బయట ఉన్నారంటే దానికి కారణం ఎవరో వాళ్లనే అడగాలి. అండర్‌వేర్‌తో పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్లను తెల్లవారుజామున వెళ్లి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాళ్లు గానీ శ్రుతి మించి మాట్లాడితే మాత్రం వారి పేర్లు కచ్చితంగా బయటపెడతాను’’ అని విష్ణు పేర్కొన్నాడు.
ఇండస్ట్రీకి చెందిన కొందరు వ్యక్తులు జైల్లో ఉండాల్సిందని.. అలాంటి వాళ్లు బయట తిరుగుతున్నారని మంచు విష్ణు చేసిన మరో వ్యాఖ్య కూడా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో మంచు విష్ణు చేసిన మరో కామెంట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
‘మా’ అధ్యక్షుడిగా తెలుగు వారే ఉండాలని తాను అనలేదని పేర్కొన్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ ‘మా’ అధ్యక్ష పదవి ఏకగ్రీవం కావాలని అంటే.. తాను వారి నిర్ణయాన్ని అంగీకరిస్తానని విష్ణు మరోసారి స్పష్టం చేశాడు.