సినీ హీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. మా అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడిన మంచి విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా’ గురించి తప్పుడు పోస్టులు పెట్టిన సభ్యుల సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తానని విష్ణు చేసిన కామెంట్లు దుమారం రేపాయి. దాంతోపాటు, టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాపై మంచు విష్ణు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.
‘ఆదిపురుష్ చిత్ర బృందం, ప్రభాస్ ప్రేక్షకులను మోసం చేసినట్టుగా భావిస్తున్నా. ఇలాంటి చిత్రాన్ని తీసుకొస్తున్నప్పుడు ప్రేక్షకులను సంతృప్తి పరిచేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి. కానీ, ఆదిపురుష్ టీజర్లో విజువల్స్ కార్టూన్ల మాదిరిగా ఉన్నాయి. సరిగ్గా సన్నద్ధం అవకుండా ప్రేక్షకులను మోసం చేస్తే ఇలాంటి స్పందనే వస్తుంది’ అని మంచు విష్ణు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఆదిపురుష్, విష్ణు ఫొటోలతో కూడిన పోస్టర్ వైరల్ అవుతోంది.
అయితే, తాజాగా ఈ వ్యవహారంపై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. ఆదిపురుష్ టీజర్ గురించి తన మాటలను వక్రీకరించారని విష్ణు అన్నారు. ఇది ఫేక్ న్యూస్ అని, జిన్నా రిలీజ్ కు ముందు కొంతమంది ఐటెం రాజాలు ఇటువంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని విష్ణు అన్నారు. తన డార్లింగ్ బ్రదర్ ప్రభాస్ కు బెస్ట్ తప్ప మరేమీ అక్కర్లేదని విష్ణు స్వయంగా ట్వీట్ చేశారు. ఇక, మా సభ్యత్వం కోరే హీరో లేదా హీరోయిన్ కనీసం రెండు చిత్రాలలో నటించి అవి థియేటర్ లేదా ఓటిటిలో విడుదల కావాలని తాను షరతు పెట్టినట్టుగా వస్తున్న వార్తలను కూడా విష్ణు ఖండించారు.