నాలుగు గోడల మధ్య జరగాల్సిన పంచాయితీలు ఈ మధ్యన రోడ్డున పడుతున్నాయి. కుటుంబం అన్న తర్వాత ఏదో ఒక ఇష్యూ కామన్. అందుకు ప్రముఖుల కుటుంబాలేవీ మినహాయింపు కావు. కాకుంటే.. ఇంటి పెద్ద ఆధ్వర్యంలో పంచాయితీ ఎక్కడో ఒకచోట తెగటం జరుగుతుంటుంది. అందుకు భిన్నమైన ఎపిసోడ్ ‘మంచు’ ఫ్యామిలో చోటు చేసుకోవటం తెలిసిందే. మోహన్ బాబు కు ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య సాగుతున్న పంచాయితీ ఒక రేంజ్ లో హైదరాబాద్ లోని జల్ పల్లి ఫాం హౌస్ వద్ద ఎంత హడావుడి జరిగింది.
కొద్ది రోజులుగా కామ్ గా ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు సీన్ తిరుపతికి మారింది. తిరుపతిలోని మోహన్ బాబు కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ కాలేజీ వద్దకు వస్తున్నట్లుగా సమాచారం అందిందని.. దీంతో సెక్యూరిటీని భారీగా మొహరించి.. కాలేజీ గేట్లను మూసేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎవరినీ లోపలకు రాకుండా కట్టుదిట్టం చేశారు. అంతేకాదు.. మీడియాను సైతం కాలేజీ పరిసరాల నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ భధ్రతా సిబ్బంది హుకుం జారీ చేశారు.
మంచు వివాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సైతం అలెర్టు అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కాలేజీ వద్ద మంచు విష్ణు.. మోహన్ బాబులు ఉన్నట్లు చెబుతున్నారు. తండ్రి మోహన్ బాబుకు ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ కు మధ్య కుటుంబ వివాదాలు చోటు చేసుకోవటం తెలిసిందే. హైదరాబాద్ లో చోటు చేసుకున్న పరిణామాల్లో జల్ పల్లి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేయటం.. అడ్డుకోవటం.. ఈ సందర్భంగా ఆగ్రహానికి గురైన మోహన్ బాబు.. ఈ మొత్తం వ్యవహారాన్ని కవర్ చేస్తున్న మీడియాలోని టీవీ9 విలేకరిపై దాడి చేయటం.. తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో కేసును ఎదుర్కొంటున్నారు. దీంతో.. వీరి ఇంటి వివాదం పక్కకు వెళ్లింది.
ఇప్పుడు హటాత్తుగా మరోసారి వీరి ఇంటి రచ్చ తెర మీదకు వచ్చింది. మొత్తంగా చూస్తే.. సేమ్ సీన్.. లొకేషన్ ఛేంజ్ అన్నట్లుగా పరిస్థితి ఉందంటున్నారు. తాజా ఎపిసోడ్ లో మరెన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకోనున్నాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మీడియా ప్రతినిధులు తగిన జాగ్రత్తలు తీసుకొని.. మంచు ఫ్యామిలీ వివాదాన్ని కవర్ చేయటం మంచిదని చెప్పాలి.