కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబు కుటుంబంలో మరోసారి వివాదం చోటు చేసుకుంది. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన.. ఆయన చిన్న కుమారుడు, నటుడు మంచు మనోజ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అటు పోలీసులకు, ఇటు మనోజ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. యూనివర్సిటీలో తన నాయనమ్మ, అమ్మమ్మ సమాధులు ఉన్నాయని.. కనుమను పురస్కరించుకుని వారికి నివాళులు అర్పించేందుకు వచ్చానని మనోజ్ చెప్పారు.
అయినప్పటికీ.. పోలీసులు ఆయనను అనుమతించలేదు. అంతేకాదు.. మనోజ్ వస్తున్న విషయం తెలుసుకుని యూనివర్సిటీ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీలో గత రెండు రోజులుగా మోహన్‌బాబు, ఆయన పెద్ద కుమారుడు, మా అధ్యక్షుడు విష్ణు ఉన్నారని.. ఈ నేపథ్యంలో మనోజ్‌ను అనుమతిస్తే గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అందుకే మనోజ్‌ను అనుమతించలేదన్నారు.
ఇక, పోలీసులతో వాగ్వాదానికి దిగినప్పటికీ.. ఫలితం లేకపోవడంతో మనోజ్ ఆయన భార్య మౌనిక వెను దిరిగారు. నేరుగా ఇదే జిల్లాలోని చంద్రగిరి మండలం నారావారి పల్లెలో ఉన్న మంత్రి నారా లోకేష్ వద్దకు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. జరిగిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చి.. కుటుంబంలో నెలకొ న్న వివాదాలను ఆయనకు వివరించారు. దీంతో తాను పరిశీలిస్తానని.. ప్రస్తుతం ఎలాంటి వివాదాలకు తావివ్వవద్దని నారా లోకేష్ చెప్పినట్టు తెలిసింది. ఈ పరిణామాలతో మనోజ్ కుటుంబం వెనుదిరిగింది.
కాగా.. మోహన్‌బాబు కుటుంబంలో ఆస్తుల వివాదం తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనపై విష్ణు దాడి చేశాడని మనోజ్.. పోలీసులకు ఫిర్యాదు చేయడం, కాదు, ఆయనే దాడి చేశాడని విష్ణు కేసు పెట్టడం పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఇక, ఈ వ్యవహారంలో ఓ మీడియా ప్రతినిధిపై మోహన్‌బాబు దాడి చేసిన వ్యవహారం.. ఇది కోర్టుకు చేరిన విషయం విదితమే. కేసు కొట్టేసేందుకు కోర్టు నిరాకరించింది. ఈ పరిణామాల క్రమంలో మరోసారి మనోజ్ వర్సిటీలోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు.