టాలీవుడ్ హీరో మంచు మనోజ్, దివంగత భూమా నాగిరెడ్డి–శోభ దంపతుల చిన్న కుమార్తె భూమా మౌనిక రెడ్డిలు రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ చాలాకాలంగా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ పెళ్లి మోహన్ బాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఇష్టం లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఓ రకంగా ఈ వ్యవహారం మంచు ఫ్యామిలీలో విభేదాలకు కారణమైందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆళ్లగడ్డలో నిర్వహించిన కార్యక్రమానికి మంచు మనోజ్, మౌనికలు జంటగా హాజరు కావడం సంచలనం రేపుతోంది. మౌనికతో కలిసి శోభా నాగిరెడ్డికి నివాళులు అర్పించాడు మంచు మనోజ్. భూమా కుటుంబ సభ్యులను పలకరించిన అనంతరం…కడపలోని ప్రఖ్యాత పెద్దదర్గాను మనోజ్ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశాడు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కొన్ని వ్యక్తిగత కారణాలతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నానని అన్నాడు. త్వరలోనే కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నానని వెల్లడించాడు. దీంతో, మనోజ్ త్వరలోనే మౌనికను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ప్రచారం మొదలైంది. ఫిబ్రవరి రెండో వారంలో ఇరు కుటుంబాల సమక్షంలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు వస్తున్నాయి.
ప్రణతిరెడ్డితో విడాకుల తర్వాత తన చిన్ననాటి స్నేహితురాలైన భూమా మౌనిక రెడ్డితో మనోజ్ ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను మనోజ్ ఖండించలేదు. ఇక, తాజాగా కొత్త జీవితం అంటూ మనోజ్ స్వయంగా కామెంట్స్ చేయడంతో వారిద్దరి ప్రేమాయణం పెళ్లి పీటలవరకు వెళ్లిందని టాక్ వస్తోంది.