సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ గురించి చర్చ జరగడం.. వాళ్ల సినిమాల మీద, మంచు విష్ణు-మంచు లక్ష్మీ ప్రసన్నల మాట తీరు మీద ట్రోల్స్ రావడం కొత్తేమీ కాదు. ఈ ట్రోలింగ్‌ను విష్ణు, లక్ష్మి తేలిగ్గానే తీసుకుంటూ ఉంటారు కూడా. సోషల్ మీడియా కాలంలో అందరూ ట్రోలింగ్‌కు బాధితులే. ఎవ్వరూ మినహాయింపు కాదు. కాకపోతే మంచు ఫ్యామిలీ గురించి ట్రోల్స్ కొంచెం ఎక్కువ వస్తుంటాయి.
ఐతే సినిమాల గురించి ఎవరేమన్నా అది కంటెంట్ ఆధారంగా ఉంటుంది కాబట్టి ఓకే. కానీ కుటుంబ వ్యవహారాల గురించి సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ చర్చ జరగడం మాత్రం ఇబ్బందికరంగానే ఉంటుంది. మోహన్ బాబు కుటుంబానికి ఈ పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. సినిమాల పరంగా ఆశించిన విజయాలు దక్కకపోయినా.. సోషల్ మీడియా ట్రోల్స్ ఎలా ఉన్నా.. కుటుంబం పరంగా మంచు వారికి తిరుగులేదనే అభిప్రాయం ఉండేది.
విష్ణు-లక్ష్మి-మనోజ్.. ముగ్గురూ కూడా ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్లు.
మంచు వారి విద్యా నికేతన్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోనే టాప్ ఎడుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఒకటి. దాని ద్వారా మంచు ఫ్యామిలీకి భారీగా ఆదాయం వస్తోంది. దాని నిర్వహణను ముగ్గురూ చక్కగా చూసుకుంటున్నారని పేరుండేది. కొన్నేళ్ల ముందు వరకు ఆస్తుల పంపకాల్లో కానీ.. కుటుంబ పరంగా కానీ ఏ విషయంలోనూ పొరపొచ్ఛాలు కనిపించలేదు. కానీ మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నాక మొత్తం మారిపోయింది. మనోజ్ అనూహ్యంగా కుటుంబానికి దూరం అయిపోయాడు.
ఇప్పుడు ఆస్తుల పంపకాల్లో గొడవలు తలెత్తి మంచు ఫ్యామిలీ వ్యవహారం రోడ్డు మీదికి వచ్చేసింది. సోషల్ మీడియాలో రెండు రోజులుగా దీని గురించే చర్చ. సినిమాల సంగతెలా ఉన్నా.. కుటుంబ పరంగా మంచు ఫ్యామిలీ ఆదర్శం అని చెప్పుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఫ్యామిలీ విషయం రచ్చకెక్కింది. మోహన్ బాబు, మనోజ్ ఒకరి మీద ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసే పరిస్థితి రావడం విచారకరం. ఇది వారి అభిమానులకు జీర్ణం కావడం లేదు. ఇరు వర్గాలూ రాజీకి వచ్చి సాధ్యమైనంత త్వరగా ఈ వివాదానికి ముగింపు పలకాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.