కోలీవుడ్ హీరో శిలంబరసన్ అలియాస్ శింబు పేరెత్తగానే వివాదాలే గుర్తుకొస్తాయి. నయనతార, హన్సికలతో ప్రేమాయణం, బ్రేకప్‌ల దగ్గర్నుంచి అతడి వివాదాలు కోకొల్లలు. దర్శకులతో, నిర్మాతలతో గొడవలకైతే లెక్కే లేదు. అతడి సినిమాలు ఇప్పటిదాకా అరడజను దాకా వివాదాల్లో చిక్కుకుని విడుదల విషయంలో ఇబ్బందుెలు ఎదుర్కొన్నాయి. రిలీజ్ తర్వాత కూడా వివాదాలు వెంటాడిన సినిమాలు కూడా ఉన్నాయి.
ఐతే ఇప్పుడు శింబు కొత్త వివాదానికి తెరతీసేలా కనిపిస్తున్నాడు. గత వివాదాలతో పోలిస్తే ఇది భిన్నమైందనే చెప్పుకోవాలి. అతను పోషించిన పాత్ర, సినిమా కథ, సన్నివేశాలు వివాదానికి దారి తీసేలా ఉన్నాయి. విలక్షణ చిత్రాల దర్శకుడు వెంకట్ ప్రభు.. శింబుతో ‘మానాడు’ అనే సినిమా అనౌన్స్ చేశాడు గత ఏడాది. అప్పుడే సినిమా పట్టాలెక్కినా కరోనా వల్ల ఆలస్యమైంది. వైరస్ ప్రభావం తగ్గాక శరవేగంగా షూటింగ్ అవగొడుతున్నారు.
తాజాగా ‘మానాడు’ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు.శింబు ఇందులో ముస్లిం యువకుడి పాత్ర పోషిస్తున్నాడు. అతడి పాత్ర పేరు.. అబ్దుల్ ఖాలిద్. ముస్లిం టోపీ పెట్టి నమాజ్ చేస్తున్న లుక్‌తో సరికొత్తగా కనిపిస్తున్నాడు శింబు. అతడి నుదుటి మీద బుల్లెట్ దిగినట్లు.. పైనుంచి రక్తం కారుతున్నట్లు కూడా ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు.
ఇది పూర్తిగా రాజకీయ నేపథ్యంలో సాగే సినిమా. ఇక హీరో ముస్లిం యువకుడు.. బ్యాగ్రౌండ్లో అంతా వార్ ఎఫెక్ట్స్ చూపించడంతో ఇది కచ్చితంగా ఉగ్రవాదం, హిందూ-ముస్లిం గొడవలు లాంటి అంశాల చుట్టూ తిరిగే సినిమా అనిపిస్తోంది. ఈ రోజుల్లో ఇలాంటి కథాంశాలతో సినిమాలంటేనే వివాదాలు తప్పనిసరి అనిపిస్తోంది.
ఈ సోషల్ మీడియా కాలంలో జనాలు మరీ సెన్సిటివ్ అయిపోయారు. కులం, మతం సంబంధిత అంశాలపై సినిమాలు తీస్తే మనోభావాలు దెబ్బ తినేస్తున్నాయి. అందులోనూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శింబు ఇలాంటి సినిమాలో నటిస్తుండటంతో కాంట్రవర్శీస్కు రెడీగా ఉండాల్సిందే అనిపిస్తోంది. మరి ఈ రాజకీయ చిత్రంతో శింబు ఎలాంటి రచ్చ లేపుతాడో చూడాలి.