కొన్ని ఉదంతాలు విచిత్రంగా ఉండటమే కాదు.. వినటానికి ఏమాత్రం నమ్మశక్యంగా ఉండదు. అమెరికాలోని ఒక రెస్టారెంట్ లో చోటుచేసుకున్న ఉదంతం ఆసక్తికరంగా మారటమే కాదు.. ఇప్పుడు వైరల్ గా మారింది.కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతంలో ఒక అజ్ఞాత వ్యక్తి రెస్టారెంట్ కు వచ్చి రూ.500 బిల్లుకు ఏకంగా రూ.2.21లక్షలు (మన కరెన్సీలో) టిప్పు రూపంలో ఇచ్చి వెళ్లిన వైనం స్వీట్ షాక్ గా మారింది.
ఓహియో స్టేట్ లోని క్లీవ్ లాండ్ నగరంలోని ఒక రెస్టారెంట్ ఉంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. జనవరి వరకు తమ హోటల్ ను మూసేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రెస్టారెంట్ ఆఖరి వర్కింగ్ డేగా నిర్ణయించారు. దీంతో.. కస్టమర్లతో రెస్టారెంట్ చాలా హడావుడిగా ఉంది. ఈ సమయంలో ఒక కస్టమర్ వచ్చి బీర్ కు ఆర్డర్ ఇచ్చారు. తాగిన తర్వాత బిల్లు తేవాలని వెయిటర్ ను కోరారు.
బిల్లు 7 డాలర్లు (మన రూపాయిల్లో దగ్గర దగ్గర రూ.500) అయితే.. బిల్లుకు మరో 3వేల డాలర్లు (సుమారు రూ.2.21లక్షలు) కలిపి 3007 డాలర్లు చెల్లించాడు. ‘గుడ్ లక్ .. మళ్లీ కలుద్దాం’ అని వెళ్లిపోయాడు. బిల్లుకు భిన్నంగా అంత భారీ మొత్తాన్ని చెల్లించటంతో రెస్టారెంట్ యజమానికి అనుమానం వచ్చింది. తప్పుగా చెల్లించి ఉంటారని భావించి.. పరుగుపరుగున సదరు కస్టమర్ వద్దకు వెళ్లారు. బిల్లుకు మించి చెల్లించారన్న విషయాన్ని అతడికి చెప్పారు.
ఆ విషయం తనకు తెలుసని.. తాను కావాలనే ఇచ్చానని.. ఆ మొత్తాన్ని సిబ్బందికి సమానంగా పంచాలని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో.. ఆ రోజున రెస్టారెంట్ లో పని చేస్తున్న నలుగురు సిబ్బందికి ఒక్కొక్కరికి 750 డాలర్లు చొప్పున పంచినట్లుగా హోటల్ యజమాని పేర్కొన్నారు. అయితే.. భారీ టిప్పు ఇచ్చిన తన పేరును మాత్రం ఎవరికి చెప్పొద్దని కోరినట్లుగా సదరు రెస్టారెంట్ పేర్కొంది. ఈ ఉదంతం వైరల్ గా మారటమే కాదు.. నెటిజన్లు పెద్ద ఎత్తున సదరు అజ్ఞాత కస్టమర్ పైన ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.