గత ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న ఈ ప్రాణాంతక వైరస్…టెర్మినేటర్ సినిమాలో విలన్ లా రంగులు, రూపాలు మార్చుకుంటూ సరికొత్త మ్యుటేషన్లతో దాడి చేస్తోంది. ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్,సెకండ్ వేవ్ ల దెబ్బకు చాలా దేశాలు ఇంకా కోలుకోలేని విధంగా దెబ్బతినగా…మరి కొన్ని దేశాలు ఆల్రెడీ థర్డ్, ఫోర్త్ వేవ్ ముప్పును చవిచూస్తున్నాయి.
ఇలా కరోనా కోరల్లోనుంచి మరో ఐదేళ్లకైనా బయటపడతామా భగవంతుడా అని మానవాళి మొత్తం వైరాగ్యంతో ఉన్న తరుణంలో తాజాగా మరో మహమ్మారి వైరస్ ప్రపంచంపై పంజా విసిరేందుకు రెడీ అవుతోంది. గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించే ‘మార్బర్గ్’ అనే వైరస్ పశ్చిమాఫ్రికాలోని గినియా దేశంలో గుర్తించారు. ఈ ప్రాణాంతక వైరస్‌తో ఒక వ్యక్తి ఆగస్టు 2 వ తేదీన మరణించినట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ ధృవీకరించింది.
ఈ వైరస్ సోకిన వ్యక్తి జ్వరంతో పాటుగా రక్తనాళాలు చిట్లిపోయి మరణిస్తాడని పేర్కొంది. ఎబోలా జాతికి చెందిన ఈ వైరస్…ప్రాణాంతకమని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన చెందుతోంది. గత 2 నెలలుగా గినియాలో ఎబోలా ముప్పు తప్పిందనుకుంటున్న తరుణంలో మార్బర్గ్ పంజా విసరడం ఆ దేశ ప్రజలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థను కలవరపెడుతోంది. పళ్లు తినే గబ్బిలాల నుంచి ఈ వైరస్ సోకుతుందని,వైరస్ సోకిన వారిలో 24 నుంచి 88 శాతం వరకు మరణం సంభవించే అవకాశం ఉండడం మరింత ఆందోళకు గురిచేస్తోంది.
ఇక, ఈ వైరస్ సోకినవారికి అందించాల్సిన చికిత్స, వ్యాక్సిన్ పై క్లారిటీ లేవని, అందుబాటులో ఉన్న ప్రత్యామ్మాయాలతోనే చికిత్స చేస్తున్నామని డబ్ల్యూహెచ్ వో వెల్లడించింది. కరోనా మాదిరిగానే ఈ వైరస్ కూడా మనిషి నుంచి మనిషికి వ్యాపించే అవకాశాలు ఉన్నాయని, ప్రపంచ దేశాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.