“సాహసం శాయరా.. కోరుకున్నది వరిస్తుంది!“ అని మాయల ఫకీరు చెప్పకపోయినా.. జీవితం మొత్తాన్ని సాహసాలకే కేటాయించాలని అనుకున్నాడు.. ఫ్రాన్స్‌కు చెందిన ఓ డింభకుడు!. కానీ, ఈ సాహసాలే.. అతని ప్రాణాల మీదకు తెచ్చాయి. మూడు పదుల వయసులోనే మృత్యువాత పడి.. ఘోరంగా ప్రాణాలు తీసుకున్నాడు. వినేందుకే.. ఎంతో బాధ కలిగించిన ఈ ఘటన.. కన్నవారికి మరింత ఆవేదనను మిగిల్చింది.,
ఎవరు? ఏం జరిగింది?
ఫ్రాన్స్‌కు చెందిన రెమీ లుసిడి ఓ యువకుడు. వయసు 30 ఏళ్లు. అంటే నవ యవ్వనంలో ఉన్నాడు. ఊరికేనే తిని తొంగున్నా.. అందరూ చేసే పనులే తాను కూడా చేసేసి జీవితాన్ని గడిపేయాలన్నా..అతనికి నచ్చలేదు. దీంతో అందరికీ డిఫెరెంట్‌గా ఉండేలా.. తాను డిఫరెంట్ బాటపట్టాడు. ఈ క్రమంలో సాహసాలకు లుసిడి కేరాఫ్‌గా మారాడు. మనలో చాలా మందికి ఎత్తైన భవనాలను చూస్తేనే కళ్లు తిరుగుతాయి. ఇక, వాటిపైకి ఎక్కి.. కిందికి చూడాలంటే.. ప్రాణాలు పోయినంత పనని జడిసిపోతారు.
కానీ, లుసిడి మాత్రం అత్యంత ఎత్తైన భవనాలను అధిరోహించడంలో నేర్పరిగా పేరుతెచ్చుకున్నారు. ప్రమాదాలతో చెలగాటమాడటం ఈ థర్టీ ఇయర్స్ యువకుడికి అత్యంత సరదా. ఇదే అతని ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ సాహసమే మూడు పదుల వయసులో ప్రాణాలు గాలిలో కలిసి పోయేలా చేసింది. ఇప్పటికే ఎన్నో సాహసాలు చేసి రికార్డు సృష్టించిన లుసిడి.. తాజాగా హాంకాంగ్‌లోని `ది ట్రెగంటెర్ టవర్` కాంప్లెక్స్‌ను అధిరోహించాలని నిర్ణయించుకున్నాడు.
ఆ ప్రకారమే సాహసానికి రెడీ అయ్యాడు. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో భవనం సెక్యూరిటీ వద్దకు వచ్చాడు. 40వ అంతస్తులో తన మిత్రుడు ఉన్నాడని చెప్పి లోపలకు వెళ్లిపోయాడు. నేరుగా 68వ అంతస్థులోకి వెళ్లి కిందికి దూకాడు.. కానీ.. దురదృష్టవశాత్తు లుసిడి కాలు కిటికీలో ఇరుక్కుపోయింది. దీంతో బలంగా రెండో కాలుతో కిటికీని తన్నాడు. దీంతో మొత్తానికి పట్టుతప్పి.. అనుకున్న విధంగా కాకుండా.. వేరే యాంగిల్లో కింద పడిపోయాడు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు.
అయితే.. 40వ అంతస్తులోని వ్యక్తి.. లుసిడి ఎవరో తనకు తెలియదని సెక్యూరిటీకి చెప్పాడు. ఉదయం 7.30 సమయంలో అతడిని పెంట్‌హౌస్‌లో పనిమనిషి చూసి పోలీసులకు కాల్ చేసింది. బ్యాలెన్స్ తప్పడంతో సాయం కోసం కిటీకిని తన్ని ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో లుసిడి కెమెరాను స్వాధీనం చేసుకొన్నారు. విచారణ చేస్తున్నారు.