ఏపీ బీజేపీ ఉత్సాహ పడుతున్న రథయాత్ర ఆలోచన ఎవరిది? ఆర్ ఎస్ ఎస్ నుంచి వచ్చి.. రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన సోము వీర్రాజుదేనా? ఆయన పార్టీని పరుగులు పెట్టించే క్రమంలో వ్యూహాత్మకంగా వేసిన అడుగులు రథయాత్ర దిశగా మారాయా? అంటే.. కాదని అంటున్నారు సీనియర్ నేతలు.
రథయాత్ర అనగానే ఒక్కసారిగా బీజేపీలో ఎక్కడా లేని ఉత్సాహం కనిపిస్తోంది. భారీ ఎత్తున చిత్తూరు జిల్లా తిరుపతి లోని కపిల తీర్థం నుంచి విజయనగరంలోకి రామతీర్థం వరకు కూడా ఈ యాత్రను నిర్వహించేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వం ఈ యాత్రకు అనుమతిస్తుందా? అనే సందేహం ఉంది.
కానీ, ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతి రెడీ అయిపోయింది! ఎవరూ కోరకుండానే.. రాష్ట్ర డీజీపీ .. రథయాత్రకు సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లాల ఎస్పీలతో అంతర్గత సమావేశాలు కూడా నిర్వహించే సి.. రూట్ క్లియరెన్స్ ఇవ్వాలని ఆదేశాలు కూడా ఇచ్చేశారు.
ఇక, బీజేపీ పరంగా చూస్తే.. ఎవరికివారు వారుగా ఉన్న నాయకులు అందరూ కలసి కట్టుగా కూర్చంటున్నారు మేధోమథనం సాగిస్తున్నారు. చేతులు కలిపి.. జగన్‌కు చుక్కలు చూపించాలని నిర్ణయించారు. మరి ఇంతగా రథయాత్రనుకానీ, పార్టీ నేతలను కానీ సోము వీర్రాజు ప్రభావితం చేయగలరా? ఇది ఆయనకు సాధ్యం అయ్యేనా? అంటే.. కాదనే అంటున్నారు సీనియర్లు.
రథయాత్ర ప్లాన్ మొత్తంగా.. ఢిల్లీ నుంచే జరుగుతున్నట్టు చెబుతున్నారు. అది కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాల కనుసన్నల్లోనే రథయాత్రకు శ్రీకారం చుట్టారని.. ఈ విషయంలో ఆ ఇద్దరి ఆదేశాల మేరకు.. సోము అంటే పడనివారు సైతం ఒకే వేదికపైకి వస్తున్నారని చెబుతున్నారు.
దీనికి బలం చేకూరుస్తున్న సంఘటన ఏంటంటే.. ఇటీవల రథయాత్రపై బీజేపీ జాతీయ నాయకురాలు పురందేశ్వరి ఇంట్లో సమావేశం జరిగింది. దీనికి సహజంగా రాష్ట్ర నాయకులు హాజరై చర్చిస్తే సరిపోయేది. కానీ, ఈ సమావేశానికి కేంద్ర మంత్రి మురళీధరన్ వచ్చారు. అంతేకాదు.. ఈ సమావేశంలో ఏం చర్చించా రో.. ఆయన మినిట్స్ రాసుకుని వెళ్లారు. ఆ వెంటనే ఏపీ సీఎం జగన్‌కు హోం మంత్రి నుంచి పిలుపు వచ్చింది.
ఈ క్రమంలోనే డీజీపీ ఎస్పీలతో భేటీ అయి.. రథయాత్రపై చర్చించారు. ఇక, రథయాత్ర ఆలోచన రావడంతోనే వెంటనే సోము ఆచరణలో పెట్టేస్తున్నట్టుగా చెప్పుకొస్తున్నారు.కానీ, ఢిల్లీ ప్లాన్‌ను మాత్రమే ఆయన అమలు చేస్తున్నారు. సో.. ఈ పరిణామాలను గమనిస్తే.. సీఎం జగన్‌తోనే రథయాత్రకు బీజేపీ పెద్దలు ఓకే చెప్పిస్తున్నారని.. డీజీపీ కూడా దానికి అనుగుణంగా అనుమతులు ఇచ్చేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. రథయాత్రను బీజేపీ పెద్దలే నడిపిస్తున్నారన్న సీనియర్ల వాదనే సరైందనే భావన కలుగుతుండడం గమనార్హం.