పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన రాష్ట్ర సీఎం మమత తన ఆస్తుల్ని తాజాగా ప్రకటించారు. నామినేషన్ కు జత చేసిన అఫిడవిట్ లో ఆమె తనకున్న ఆస్తుల లెక్కను వెల్లడించారు. రెండు దఫాలు పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించి.. మూడో సారి అధికార పగ్గాలు అందుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆమె నికర ఆస్తులు కేవలం రూ.16.72 లక్షలు కావటం గమనార్హం.
66 ఏళ్ల మమత వద్ద ఉన్న మొత్తం చరాస్తుల విలువ రూ.16.72 లక్షలుకాగా.. గత ఎన్నికల వేళ వీటి విలువను రూ.30 లక్షలుగా చూపించారు.బ్యాంకు బ్యాలెన్స్ రూ.13.53 లక్షలు ఉంటే.. ఇందులో ఎన్నికల ఖర్చుకు సంబంధించిన రూ.1.51లక్షలు కూడా ఉన్నాయి. జాతీయ పొదుపు సర్టిఫికేట్ లో రూ.18,490 డిపాజిట్ చేశారు. టీడీఎస్ రూపంలో 2019-20లో రూ.1.85లక్షలు రావాల్సి ఉంది. ఇక.. తొమ్మిది గ్రాముల బంగారం తన వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు.
2019-20 ఏడాదిలో తన పుస్తకాలకు రాయల్టీ రూపంలో వచ్చిన మొత్తం రూ.930గా పేర్కొన్నారు.తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదని.. కలకత్తా వర్సిటీ నుంచి ఎంఏ.. ఎల్ఎల్ బీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఇంత తక్కువ నికర ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రి మమతే అవుతారేమో? రెండు దఫాలు సీఎంగా చేసి కూడా కోటి కూడా లేని ఆమె ఆస్తులు చూస్తే.. తెలుగుప్రజలు జీర్ణించుకోవటం కష్టమేమో?