‘తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నే వాడుంటాడు’ అనే సామెతను మమతా బెనర్జీ అక్షరాల రుజువుచేసి మరీ చూపించారు. పశ్చిమబెంగాల్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. అందులో కూడా ఇటు మమతాబెనర్జీ అటు నరేంద్రమోడి ఒకరిని ఇబ్బంది పెట్టడానికి మరొకరు చేయని ప్రయత్నాలు లేవు, వేయని పన్నాగాలు లేవు.
గవర్నర్ ను అడ్డుపెట్టుకుని కేంద్రం మమతను సాధించాలని చూస్తోంది. ఇదే సమయంలో మమత కూడా బీజేపీ ఎంఎల్ఏ ద్వారానే మోడికి తాజాగా షాకిచ్చారు.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే బెంగాల్లో తృణమూల్-బీజేపీ మధ్య ఫిరాయింపులు, రివర్స్ ఫిరాయింపులు ఎంత జోరుగా సాగుతున్నాయో అందరికీ తెలిసిందే. ఒకసారి రాజకీయాల్లో దిగుజారుడుతనం మొదలైన తర్వాత ఎవరెంత పాతాళానికి దిగజారిపోయారని చూసుకోకూడదు. ఒకరిపై మరొకరు బురదచల్లేయటమే ప్రస్తుత రాజకీయ ట్రెండ్.
ఎంఎల్ఏలను ఛైర్మన్లుగా బెంగాల్ అసెంబ్లీలో మమత కమిటీలను నియమించారు. ఇలాంటి కమిటీల్లో కీలకమైన పీఏసీ (పబ్లిక్ ఎకౌంట్స్ కమిటి)ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వటం రివాజు. సో సంప్రదాయం ప్రకారమే పీఏసీ ఛైర్మన్ గా బీజేపీ సభ్యుడైన ముకుల్ రాయ్ ని నియమించారు. దాంతో బీజేపీ ఒక్కసారిగా గోల మొదలుపెట్టేసింది. కారణం ఏమిటంటే ముకుల్ రాయ్ మొన్నటి ఎన్నికల్లో బీజేపీ తరపునే గెలిచినా తర్వాత తృణమూల్ వైపొచ్చేశారు.
అంటే సాంకేతికంగా ముకుల్ బీజేపీ ఎంఎల్ఏనే. కానీ మనిషి మాత్రం తృణమూల్ తో చేతులు కలిపేశాడు. మమత చేసిన నియామకంతో ఏమి చేయాలో దిక్కుతెలీక శాసనసభాపక్షం నేత సువేందు అధికారి జుట్టు పీక్కుంటున్నాడు. మమత చేసింది అన్యాయమని, అక్రమమని నానా గోల చేస్తున్నాడు. అయితే మమత దేన్నీ లెక్కచేయటంలేదు. ఎందుకంటే ముకుల్ బీజేపీ సభ్యుడు కాదనేందుకు వీల్లేదు. అసెంబ్లీ రికార్డులు చూసినా, ఎన్నికల కమీషన్ ప్రకారం చూసినా ముకుల్ బీజేపీ ఎంఎల్ఏనే.
మమత నియామకాన్ని సువేందు ఢిల్లీలోని పెద్దలకు కూడా చెప్పారట. అయితే వాళ్ళకూ ఏమి చేయాలో అర్ధం కావటంలేదట. మొన్నటి ఎన్నికల ముందు ఇదే సువేందుతో పాటు మరో 28 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలను స్వయంగా నరేంద్రమోడి, అమిత్ షా లు బీజేపీలో చేర్చుకున్నారు.
అప్పుడు మమత ఎంత గోలపెట్టినా మోడి, అమిత్ ఏమాత్రం పట్టించుకోలేదు. అప్పట్లో మోడి అండ్ కో ఏమి చేశారో ఇపుడు మమత వాళ్ళకు అదే చేస్తోంది. అందుకే తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడుంటడనే సామెత వచ్చింది.