మంత్రి మల్లారెడ్డి …ఈ మధ్యకాలంలో ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో, మీడియాలో ఫాలోయింగ్ సంపాదించుకున్న రాజకీయ నాయకుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. పాలమ్మినా..పూలమ్మినా..కష్టపడ్డా…అంటూ మల్లారెడ్డి చెప్పిన డైలాగులు సోషల్ మీడియాలో ఇప్పటికీ మీమ్స్ రూపంలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక, రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి తొడగొట్టిన వ్యవహారం అయితే రాజకీయ రచ్చ లేపింది.
ఈ క్రమంలోనే తాజాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో అది ఎన్నికల స్టంటే అనుకోండి అంటూ మల్లారెడ్డి మీడియా ముందు చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. మాది రాజకీయ పార్టీ.. ఎన్నికలొస్తున్నాయి…ఇది ఎన్నికల స్టంట్ లానే ఉంటుంది..కార్మికులు సంతోషంగా ఉన్నారు కదా అంటూ మల్లారెడ్డి చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. అలా విలీనం చేసే దమ్ము, ధైర్యం, ఫండ్స్ కేసీఆర్కు మాత్రమే ఉన్నాయని మల్లారెడ్డి కితాబిచ్చారు. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే మల్లారెడ్డి తాజాగా నేడు మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు.
కొద్ది రోజుల క్రితం ఐటీ అధికారులు తన ఇంట్లో సోదాలు చేవారని, కానీ, డబ్బులున్న గదిని వారు చూడలేదని షాకింగ్ కామెంట్లు చేశారు. ఇక, ఆ డబ్బు తాను ఎన్నికలకు ఖర్చు చేస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఏ పార్టీలో ఎవరు అభ్యర్థిగా ఉండాలో తానే డిసైడ్ చేస్తానని అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతు్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిని కూడా తానే నిర్ణయిస్తానని చెప్పడం విశేషం. గతంలో కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్కు టికెట్ ఇప్పించింది తానేన, మేడ్చల్ కాంగ్రెస్లో గ్రూప్ గొడవలు తామే సృష్టిస్తున్నామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అధిష్ఠానంలో తనకు స్నేహితులున్నారని, రేవంత్ రెడ్డిపై తొడగొట్టిన తరువాత గ్రాఫ్ పెరిగిందని మల్లారెడ్డి అన్నారు. ఆర్టీసీ విలీనం కామెంట్లు కాస్త ఫరవాలేదనుకున్నా…తన ఇంట్లో డబ్బుల గదిని అధికారులు చూడలేదన్న వ్యవహారం మాత్రం ఆయన మెడకు చుట్టుకునే చాన్స్ ఉంది. ఇక, కాంగ్రెస్ లో గొడవలు క్రియేట్ చేస్తున్నామంటూ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు డ్యామేజీ కలిగించే అవకాశం ఉంది.