ఈ శుక్రవారమే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘యానిమల్’ మూవీ. పేరుకే ఇది బాలీవుడ్ మూవీ కానీ.. తెలుగులో కూడా ఈ చిత్రానికి బంపర్ క్రేజ్ ఉంది. నిన్నటి ‘యానిమల్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌తో హైప్ ఇంకా పెరిగింది. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో భారీ ఎత్తున ఈ ఈవెంట్ నిర్వహించారు. బహుశా రణబీర్ కపూర్ ఇలాంటి ఈవెంట్లో ఎప్పుడూ పాల్గొని ఉండకపోవచ్చు. ఈ వేడుకలో మహేష్ బాబు, రాజమౌళి సహా అందరూ రణబీర్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు.
మహేష్ బాబు అయితే.. తాను రణబీర్‌కు పెద్ద ఫ్యాన్ అని చెబుతూ, ప్రస్తుతం దేశంలో అతనే బెస్ట్ యాక్టర్ అంటూ పెద్ద కాంప్లిమెంటే ఇచ్చాడు. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఈ ఈవెంట్ జరిగిన మల్లారెడ్డి కాలేజీ అధినేత, తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన ప్రసంగమే రణబీర్, బాలీవుడ్ అభిమానులకు అంతగా రుచించలేదు. ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఆధిపత్యం గురించి వివరిస్తూ.. కొంచెం దూకుడుగా మాట్లాడారు మల్లారెడ్డి.
తెలుగు సినిమా బాలీవుడ్, హాలీవుడ్‌ను మించిపోతుందని.. ఇకపై ఆధిపత్యం అంతా తెలుగు సినిమాదే అని వ్యాఖ్యానించిన ఆయన.. బొంబాయి పాతబడిపోయిందని, బెంగళూరులో ట్రాఫిక్ జామ్ పెరిగిపోయిందని.. కాబట్టి భవిష్యత్ అంతా హైదరాబాద్‌దే అని.. కాబట్టి రణబీర్ ఇంకో ఏడాదిలో ఈ సిటీకే మకాం మార్చేయాలని ఆయన అన్నారు. ఇంకో రెండు రోజుల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యల్లో రాజకీయ కోణం కూడా ఉన్న మాట వాస్తవం. మల్లారెడ్డి ఇలా ఓవర్ ద టాప్ స్టయిల్లో ప్రసంగాలు చేయడం మన వాళ్లకు కొత్తేమీ కాదు.
కానీ ఈ మాటలు బాలీవుడ్ అభిమానులకు, ముఖ్యంగా రణబీర్ ఫ్యాన్స్‌కు రుచించలేదు. ఆయన మాట్లాడింది హిందీలోనే కావడంతో వాళ్లకు విషయం అర్థమైపోయింది. మల్లారెడ్డి స్టైల్ తెలియక.. తెలంగాణ మంత్రి బాలీవుడ్‌ను తక్కువ చేసేలా మల్లారెడ్డి మాట్లాడారంటూ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. మల్లారెడ్డి మాట్లాడుతున్నపుడు రణబీర్ కొంచెం ఇబ్బందిగా ఫేస్ పెట్టడంతో.. ఒక బాలీవుడ్ టాప్ హీరోను పిలిచి ఇలాగేనా ట్రీట్ చేసేది అంటూ అతడి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి విషయాలను వివాదాలు చేయడానికి కాచుకుని ఉండే కమల్.ఆర్.ఖాన్ లాంటి వాళ్లు ఈ వీడియోను బాగానే వాడుకుంటున్నారు.