మల్లారెడ్డి …ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు సుపరిచితమే. పాలమ్మినా…పూలమ్మినా…కష్టపడ్డా…అంటూ మల్లారెడ్డి చెప్పిన డైలాగ్ వైరల్ గా మారి ఆయనకు ఓవర్ నైట్ లో సెలబ్రిటీ క్రేజ్ తెచ్చిపెట్టింది. సినీ హీరోలకన్నా తనకే ఎక్కువ సోషల్ మీడియా ఫాలోవర్లున్నారంటూ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన డిబేట్ లో మల్లారెడ్డి చెప్పడం సంచలనం రేపింది. ఇలా, మల్లారెడ్డి ఏం చెప్పినా…ఏ చేసినా సంచలనమే.
ఈ క్రమంలోనే మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన మల్లారెడ్డి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని పుకార్లు వస్తున్నాయి. తనకు మంత్రి పదవినిచ్చిన పార్టీకి మల్లారెడ్డి గుడ్ బై చెప్పబోతున్నారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మల్లారెడ్డి రేపో మాపో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని టాక్ వస్తోంది. ఆ టాక్ కు తగ్గట్లుగానే తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశానికి మల్లారెడ్డి డుమ్మా కొట్టారు.
బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన అభ్యర్థులు, బీఆర్ఎస్ కీలక నేతలతో కేటీఆర్ తాజాగా భేటీ అయ్యారు. అయితే, ఈ భేటీకి మల్లారెడ్డితోపాటు ఆయన అల్లుడు,మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు గైర్హాజరు కావడం సంచలనం రేపుతోంది. ఓటమిపై విశ్లేషణ, భవిష్యత్ కార్యచరణపై చర్చలో పాల్గొనేందుకు వీరు రాకపోవడంతో వారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న వాదనకు బలం చేకూరుతోంది. మరి, ఈ పుకార్లపై మల్లారెడ్డి క్లారిటీనిస్తారా..లేదంటే ఆయన రీతిలో కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకొని అందరికీ షాకిస్తారా అన్నది తేలాల్సి ఉంది.