ఇటీవల కాలంలో రెవెన్యూ శాఖకు చెందిన వివిధ హోదాల్లోని అధికారుల్ని ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకోవటం.. కోట్లాది రూపాయిల అవినీతి భాగోతాన్ని తవ్వి తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మల్కాజిగిరి ఏసీపీగా వ్యవహరిస్తున్న నర్సింహారెడ్డి అవినీతి భాగోతం బద్ధలైంది. ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇవ్వటమే కాదు.. ఏక కాలంలో దాదాపు పాతిక చోట్ల సోదాల్ని నిర్వహించినట్లు చెబుతున్నారు.
సికింద్రాబాద్ లోని మహేంద్ర హిల్స్ లోని ఆయన సొంతింటికి ఏసీబీ అధికారులు తెల్లవారుజామున చేరుకున్నారు. అంతేకాదు.. ఆయన స్వగ్రామమైన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం పూల ఓబయ్యపల్లితో పాటు.. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న బంధువులు.. స్నేహితులు.. బినామీ ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.7.5 కోట్ల ఆస్తుల లెక్కల్ని బయటపెట్టారు. అయితే.. వీటి విలువ బహిరంగ మార్కెట్ లో దాదాపు రూ.70 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
బుధవారం ఉదయం మొదలైన సోదాలు.. అర్థరాత్రి వరకు సాగుతూనే ఉన్నాయి. ఆయనకు సంబంధించిన బ్యాంకు లాకర్లు తెరిస్తే మరిన్ని ఆధారాలు లభించే వీలుందని చెబుతున్నారు. తనకు అనుకూలంగా ఉండే వారిని బినామీలుగా ఏర్పాటు చేసుకొని సైబరాబాద్ ప్రాంతంలో భారీ ఎత్తున ఆస్తులు కొన్నట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా.. కొందరు బినామీల్ని గుర్తించారు.
తన బినామీలకు వారి పెద్దల నుంచి వారసత్వంగా ఆస్తులు దక్కించుకున్నట్లుగా గిఫ్ట్ డీడ్ లు క్రియేట్ చేయటాన్ని గుర్తించారు. స్థలాలు శేరిలింగంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ఉన్నా.. అందుకు ఏ మాత్రం సంబంధం లేని ఎల్ బీనగర్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిష్టర్ చేయించినట్లుగా గుర్తించారు.
మరింత షాకింగ్ అంశం ఏమంటే.. నార్సింగ్ ప్రాంతంలో రూ.15వేల నెలసరి జీతానికి నీళ్లు పోసే వ్యక్తిని తన బినామీగా ఉంచుకున్న వైనాన్ని గుర్తించారు. అతడిపేరు మీద తన సొంతూరులో 5 ఎకరాలు.. కుటుంబ సభ్యుల పేరు మీద దాదాపు 50 ఎకరాల్ని సమకూర్చుకున్నట్లుగా తేల్చారు. తవ్వేకొద్దీ ఆక్రమ సంపాదన బయటపడుతుందని అధికారులు భావిస్తున్నారు. మొదట్లోనే బయటకు వచ్చిన ఆస్తుల విలువ రూ.70కోట్లకు పైనే ఉన్న వేళ.. రానున్న రోజుల్లో ఈ అంకెలు భారీ మార్పులు తప్పవన్న మాట వినిపిస్తోంది.