టాలీవుడ్లో ఫ్యాన్ వార్స్ రోజు రోజుకూ హద్దులు దాటిపోతున్నాయి. ఆఫ్ లైన్ ఫ్యాన్ వార్స్ అయితే ఎప్పుడో ఒకసారి అనుకోకుండా గొడవ పడ్డారు.. తర్వాత ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు అన్నట్లుండేది. కానీ అంతా ఆన్ లైన్ అయిపోయాక కథ మారింది.
సోషల్ మీడియాలో తిష్ట వేసుకుని కూర్చునే ఫ్యాన్స్.. తమ హీరోను ఎలివేట్ చేయడం కంటే.. వేరే హీరోను డీగ్రేడ్ చేయడం, అవతలి ఫ్యాన్స్‌ను కెలకడమే పనిగా పెట్టుకుంటున్నారు.
తమ కుటుంబం గుిరంచి, కెరీర్ల గురించి, భవిష్యత్ గురించి, సొసైటీలో సమస్యల గురించి ఏ పట్టింపూ ఉండదు కానీ.. సిల్లీ సిల్లీ కారణాలతో ఫ్యాన్ వార్స్ చేసుకోవడం.. దారుణమైన హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ఒకరినొకరు కించపరుచుకోవడం, దిగజారి ప్రవర్తించడంలో మాత్రం ఈ ఫ్యాన్స్ ముందుంటున్నారు. తాజాగా మహేష్ బాబు, ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో పడి నిన్నట్నుంచి ఇలాగే కొట్టేసుకుంటున్నారు.
టాలీవుడ్లో మహేష్ బాబు కింగ్ అంటే.. కాదు ప్రభాసే కింగ్ అంటూ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కొంత కాలం నుంచి బాగా గొడవ పడుతున్నారు. అవి ఇప్పుడు పర్సనల్ లెవల్‌కు వెళ్లిపోయాయి. ఒక ప్రభాస్ అభిమాని, నేను బెంగళూరులో ఉంటా రా చూస్కుందాం అంటూ మహేష్ అభిమానికి సవాలు విసిరాడట.
అతను అడ్రస్, ఫోన్ నంబర్ ట్విట్టర్లో పెట్టాడట. దీంతో మహేష్ ఫ్యాన్స్ ప్రభాస్ అభిమానికి ఫోన్ చేసి బూతులు తిట్టడం, అదంతా రికార్డ్ చేసి ట్విట్టర్లో పెట్టడం.. అవతల ప్రభాస్ అభిమానులు ఒక్కటై మహేష్ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేయడం.. మరోవైపు బెంగళూరులో ప్రభాస్ ఫ్యాన్ ఇచ్చిన అడ్రస్‌కు వెళ్లి అక్కడ చీర పెట్టి కట్టుకోమంటూ ఫొటో తీసి దాన్ని ట్విట్టర్లో షేర్ చేయడం.. ప్రతిగా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇలాంటిదే ఏదో చేయడం.. ఇలా మొదలైన చిచ్చు.. తర్వాత లక్షల మంది అభిమానులు ట్విట్టర్లో పడి తీవ్రంగా గొడవ పడే స్థాయికి చేరుకుంది.
అవతలి హీరోలను డీగ్రేడ్ చేసేలా దారుణమైన హ్యాష్ ట్యాగ్స్ పెట్టి నిన్నట్నుంచి ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఆ హ్యాష్ ట్యాగ్స్ మీద ఉన్న ట్వీట్లు దారుణంగా ఉంటున్నాయి. మామూలుగా అయితే ఇవేవో సిల్లీ గొడవలని జనాలు పట్టించుకునేవారు కాదు కానీ.. ఈ హ్యాష్ ట్యాగ్స్ నేషనల్ లెవెల్లో టాప్‌లో ట్రెండ్ అవుతుండడంతో అసలేం జరిగిందా అని ఆరాతీసి.. ఇలాంటి సిల్లీ విషయాలకు ఇంత రచ్చ చేస్తారా.. వీళ్లకేమీ పనీ పాటా ఉండదా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.