సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, హీరో మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి కన్నుమూశారు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆమె తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇందిరా దేవి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు ఉదయం మరణించారు. ఈ క్రమంలోనే అభిమానులు, ప్రజలు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం ఇందిరా దేవి పార్థివ దేహాన్ని పద్మావతి స్టూడియోస్ కు తరలించారు.
ఈ రోజు మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం ఇందిరా దేవి పార్థివ దేహాన్ని అక్కడే ఉంచనున్నారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఇందిరా దేవి అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. అయితే ఈ అంతిమ సంస్కారాల కార్యక్రమానికి మీడియాను అనుమతించడం లేదని, తమ కుటుంబం ఉన్న క్లిష్ట పరిస్థితిని అర్థం చేసుకోవాలని మహేశ్ బాబు కుటుంబ సభ్యులు కోరారు.
ఇందిరా దేవి మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఇందిరా దేవికి నివాళులర్పించేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పద్మాలయా స్టూడియోస్ కు తరలివస్తున్నారు. మంత్రి కేటీఆర్, హీరో వెంకటేష్, నిర్మాత, దర్శకురాలు జీవితా రాజశేఖర్, దర్శకుడు కొరటాల శివ, ప్రముఖ నిర్మాత అశ్వినిదత్, దర్శకుడు త్రివిక్రమ్, సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్, సీనియర్ నటుడు మోహన్ బాబు, నిర్మాత బండ్ల గణేష్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తదితరులు ఇందిరా దేవి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
ఈ ఏడాది జనవరిలో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కూడా అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో, ఒకే ఏడాదిలో ఘట్టమనేని కుటుంబం ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయినట్లయింది.