ప్రస్తుతం తెలుగులో అత్యధిక బ్రాండ్ వాల్యూ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకడు. యాడ్స్ ఏం చేస్తాం.. బ్రాండ్లను ఏం ప్రమోట్ చేస్తాం.. మన స్థాయికి అది కరెక్టా అని ఒకప్పటి స్టార్లు తర్జన భర్జనల్లో ఉన్న సమయంలో మహేష్ బాబు.. బాలీవుడ్ స్టార్ల తరహాలో అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించడం, ప్రకటనల్లో నటించడం ద్వారా ఈ విషయంలో ఒక ‘ఐకాన్’లా మారాడు. ప్రస్తుతం అతడి చేతిలో రెండంకెల సంఖ్యలో బ్రాండ్లు ఉన్నాయి.
ఒక్క నిమిషం నిడివితో సాగే ప్రకటనల కోసం మహేష్ కోట్లల్లో పారితోషకం పుచ్చుకుంటాడు. సినిమాలతో కంటే ఈ మార్గంలోనే మహేష్ ఎక్కువ ఆర్జిస్తాడంటే అతిశయోక్తి కాదు. ఈ విషయంలో మరికొన్ని కొత్త మార్గాలను మహేష్ అన్వేషిస్తున్నట్లుగా కనిపిస్తోంది.కేవలం బ్రాండ్ల కోసం ప్రకనటల్లో నటించడానికి పరిమితం కాకుండా ఒక టీవీ ఛానెల్ కమ్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌కు అతను ప్రచారకర్తగా మారబోతున్నట్లు సమాచారం.
జీ గ్రూప్.. మహేష్ బాబుతో ఒక భారీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా జీ తెలుగు ఛానెల్లో కార్యక్రమాలను, అలాగే జీ5 ఓటీటీలో కంటెంట్‌ను అతను ప్రమోట్ చేస్తాడు. మహేష్ వీడియో బైట్లతో పాటు ఫొటోలు, ఆడియో బైట్లను ఉపయోగించుకుని తమ కార్యక్రమాలను ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో ‘జీ’ ప్రమోట్ చేసుకుంటుంది. ఏడాది కాంట్రాక్టుకు గాను అతను రూ.9 కోట్లు అందుకోనున్నాడట. ఇందుకోసం మహేష్ ఎక్కువ సమయం అయితే పెట్టాల్సిన అవసరం ఉండకపోవచ్చు. తెలుగులో టీవీ బ్రాండ్ ప్రమోషన్ల పరంగా ఇది బిగ్గెస్ట్ డీల్ అని చెప్పొచ్చు.
ఇక మహేష్ ఫిలిం కెరీర్ విషయానికి వస్తే.. ఈ వేసవిలో ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మహేష్.. త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని మొదలుపెడుతున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ సరికొత్త అవతారంలోకి మారబోతున్నాడు. ప్రస్తుతం ఆ మేకోవర్ పనే నడుస్తోంది.