కొంతమందికి సంవత్సరాల పాటు కష్టపడినా మంచి చాన్సులు రావు. కొంతమందిని మాత్రం అవకాశాలు వెతుక్కుంటూ వచ్చి ఒళ్లో వాలతాయి. మీనాక్షీ చౌదరి విషయంలో ఈ రెండోది జరుగుతోంది. 2018 మిస్ ఇండియా టైటిల్ విజేత అయిన ఈ హర్యానా అమ్మాయికి టాలీవుడ్లో మంచి ఫ్యూచర్ కనిపిస్తోంది.
మొదట మ్యూజిక్ వీడియోస్‌లో కనిపించిన మీనాక్షి.. ఆ తర్వాత ‘అవుటాఫ్ లవ్’ సిరీస్‌లో నటించింది. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అదింకా రిలీజ్ కాకముందే రవితేజ ‘ఖిలాడీ’లో చాన్స్ కొట్టేసింది. అడివి శేష్ హీరోగా నాని నిర్మిస్తున్న ‘హిట్’ మూవీ సీక్వెల్లో నటిస్తోంది. ఓ తమిళ చిత్రం కూడా చేస్తోంది.
రీసెంట్గా మీనాక్షి మరో రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో చోటు సంపాదించినట్టు తెలుస్తోంది. వాటిలో ఒకటి ప్రభాస్ నటిస్తున్న ‘సాలార్’. మరొకటి మహేష్‌బాబుతో త్రివిక్రమ్ తీయబోతున్న సినిమా. ‘సాలార్’లో ఒక స్పెషల్ రోల్లో మీనాక్షి కనిపించనుందట. ఇక మహేష్ సినిమాలో సెకెండ్ హీరోయిన్గా ఆమెను తీసుకున్నారట.
సాధారణంగా మహేష్ సినిమాల్లో ఒకే హీరోయిన్ ఉంటుంది. కానీ త్రివిక్రమ్ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లకి చోటుంటుంది. ఈ సినిమాలోనూ అంతేనట. మెయిన్ లీడ్‌గా పూజా హెగ్డే నటించబోతోంది. సెకెండ్ లీడ్‌గా మీనాక్షిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ‘సర్కారువారి పాట’ పూర్తిగా కాగానే ఈ మూవీ సెట్స్‌కి వెళ్లనుంది. ఈ న్యూస్ కనుక నిజమైతే మీనాక్షి కెరీర్ మాంచి స్పీడందుకున్నట్టే.