రాజధాని అమరావతి భూముల క్రయవిక్రయాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని గొంతు చించుకుంటున్న ప్రభుత్వ పెద్దలు.. ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితుడైన వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి నిర్వాకంపై నోరెత్తడం లేదు. తమ పార్టీకే చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ దాడులు చేయించిన వీరు.. ఇప్పుడు అయోధ్యరామిరెడ్డికి చెందిన ‘రాంకీ’ గ్రూపుల అక్రమాలను ఆదాయ పన్ను శాఖ బయటపెట్టేసరికి గప్‌చుప్ అయిపోయారు.
రాంకీ కంపెనీ గుట్టును ఆదాయపు పన్ను శాఖ రట్టు చేసింది. రూ.300 కోట్ల ఆదాయానికి పన్ను ఎగవేసిందని.. రూ.1,200 కోట్ల మేర ఉత్తుత్తి నష్టాలు చూపిన వైనాన్ని బయటపెట్టింది. ఐటీ అధికారులు కొద్దిరోజుల కింద హైదరాబాద్‌లోని అయోధ్య రామిరెడ్డి నివాసంతోపాటు ‘రాంకీ’కి చెందిన 15 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో అనేక కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
గ్రూపు సంస్థల నడుమ లావాదేవీల్లో పలు అక్రమాలు కూడా బయల్పడ్డాయి. రాంకీ గ్రూపులోని ఒక సంస్థకు చెందిన మెజారిటీ వాటాను సింగపూర్‌లో ఓ విదేశీ సంస్థకు 2018-19లో విక్రయించారు. తద్వారా భారీ లాభాలు గడించారు. కానీ ఆ ఆదాయాన్ని లెక్కల్లో చూపకుండా దాచిపెట్టడమే గాకుండా.. రకరకాల మాయలు చేసి కృత్రిమ నష్టాన్ని చూపించారు.
భారీగా షేర్లు కొనడం, అమ్మడం, పరస్పర కుమ్మక్కుతో ఇతరులతో లావాదేవీలు జరపడం, ఆ తర్వాత సదరు సంస్థకు బోనస్‌లు ఇవ్వడం వంటి చిత్రవిచిత్ర విన్యాసాలు చేశారు.
సింగపూర్ సంస్థకు వాటాల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయంపై పన్ను ఎగవేసేందుకే ఇలాంటివి చాలా చేసినట్లు ఆధారాలు కూడా దొరికాయి. 1,200 కోట్ల మేర ఉత్తుత్తి నష్టాలు చూపారనడానికి సంబంధించిన కీలక పత్రాలు ఐటీ అధికారులకు సోదాల్లో లభించాయి.
అంతేకాదు.. కొన్ని లావాదేవీలకు సంబంధించి రూ.288 కోట్లను తిరిగి రాని మొండిబకాయిలుగా రాంకీ చూపించింది. ఇది కూడా నిజం కాదని తేలింది. గ్రూపు సంస్థల మధ్య లెక్కల్లో చూపని అనేక నగదు లావాదేవీలు కూడా సోదాల్లో బయటపడ్డాయి. ఈ మొత్తం రూ.650 కోట్ల వరకు ఉండవచ్చని ఐటీ శాఖ అధికారులు తెలిపారు.
ఏడాది కాలంలో 442 శాతం పెరిగిన రాంకీ షేర్
గత రెండేళ్లలో రాంకీ కంపెనీ ఆస్తులు అమాంతం పెరిగిన కారణంగానే ఐటీ శాఖ దానిపై కన్నేసింది. ఈ కంపెనీ షేర్ ధర గతంలో ఎన్నడూ లేనంతగా కేవలం ఏడాది కాలంలో 442 శాతం పెరగడం గమనార్హం. దీనిపై విపక్ష టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
సీఎం జగన్ ఈ రాష్ట్రాన్ని అప్పులపాల్జేస్తూ.. దివాలా దిశగా తీసుకెళ్తున్నారని.. ఇదే సమయంలో ఆయన సొంత సంస్థలు, వైసీపీ నేతల కంపెనీలు కళకళలాడుతున్నాయని విమర్శిస్తున్నారు. ‘ప్రజలిచ్చిన అధికారాన్ని సొంత వ్యాపారాలను వృద్ధి చేసుకునేందుకు వైసీపీ నేతలు వాడుకుంటున్నారు ప్రభుత్వ పరపతిని మాత్రం పోగొట్టి బ్యాంకుల ముందు ‘దేహీ’ అనే పరిస్ధితికి దిగజార్చారు’ అని దుయ్యబడుతున్నారు.
జగన్‌రెడ్డి కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్‌లో ‘వై క్యాట్స్’ అనే కంపెనీ కూడా ఒక వాటాదారు. వారికి ఈ దేశంలో ఒక్క భారతీ సిమెంట్స్ కంపెనీలో మాత్రమే వాటాలు ఉన్నాయి. ఈ దేశంలో తమకు వాటాలు ఉన్న సిమెంట్ కంపెనీల వ్యాపారం ఈ ఏడాది తొలి 3 నెలల్లో అనూహ్యంగా 42 శాతం పెరిగిందని అది తమ వెబ్సైట్లో పేర్కొంది.
సిమెంట్ ధర పెరగడం దీనికి కారణమని కూడా అందులోనే రాశారు. వాస్తవానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి. సిమెంట్ కంపెనీలను సిండికేట్ చేసి భారీగా ధరలు పెంచేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. జగన్ అక్రమాస్తుల కేసుల్లో నంబర్ 2గా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడికి చెందిన అరబిందో కంపెనీకి ప్రభుత్వం రాష్ట్రంలోని పోర్టులను ఒకదాని వెంట ఒకటి ధారాదత్తం చేస్తోంది.
కాకినాడ ప్రాంతంలోని రెండు కీలకమైన పోర్టులతోపాటు రామాయపట్నం పోర్టును కూడా అరబిందో పరం చేశారు. జగన్ అవినీతి కేసుల్లో హెటరో డ్రగ్స్ కంపెనీ యజమాని పార్థసారథిరెడ్డి కూడా సహనిందితుడు. ఈ కంపెనీకి విశాఖపట్నం వద్ద రూ.225 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం అప్పగించింది.
విశాఖలోని బే పార్క్‌తోపాటు మరికొన్ని కీలక ఆస్తులను కూడా ఈ కంపెనీపరం చేసింది. ప్రజలిచ్చిన అధికారాన్ని తమ వారిని బాగు చేసుకోవడానికి జగన్ ఎలా వాడుకుంటున్నారో ఇదే ఉదాహరణని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.