ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చుట్టూ అల్లుకున్న లిక్కర్ స్కాం దేశాన్ని కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ లిక్కర్ స్కాంలో ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతల పేర్లు కూడా వినిపిస్తుండటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఏపీలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈ కుంభకోణంతో సంబంధాలున్నాయని ఆరోపణలు వస్తుండగా, తెలంగాణలో సీఎం కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పేరు కూడా ఈ వ్యవహారంలో వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే కవితపై, కేసీఆర్ కుటుంబం పై కాంగ్రెస్ పార్టీ కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేటీఆర్ ఉద్యమంలోకి హఠాత్తుగా వచ్చారని, ఆయన చెల్లెలు కవితమ్మ కూడా బతుకమ్మ బతుక నేర్చారని షాకింగ్ కామెంట్లు చేశారు. తెలంగాణ ఉద్యమ ముసుగులో ప్రజల ఆకాంక్షను అడ్డుపెట్టుకొని కేసీఆర్ కుటుంబం అధికారంలోకి వచ్చిందని విమర్శలు గుప్పించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీతో పాటు అందరినీ కేసీఆర్ మోసం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ వచ్చాక కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, అమరవీరుల కుటుంబాలకు కనీసం ఆర్థిక సాయం కూడా అందలేదని మండిపడ్డారు. ఇక, ఉద్యమ ద్రోహులకు ప్రభుత్వంలో పెద్దపీట వేశారని బహుజన బిడ్డలకు గొర్రెలు, బర్రెలు, తాటి, ఈత చెట్లు ఇచ్చారని విమర్శలు గుప్పించారు.
ఒక మహిళ అయి ఉండి లిక్కర్ ధందా చేయడానికి సిగ్గుండాలని కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితే ప్రత్యేక విమానాల్లో వచ్చి డబ్బులు ఏర్పాటు చేశారని బీజేపీ నాయకులు అరోపిస్తున్నారని అన్నారు.