ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ విలక్షణ దర్శకుడు సుకుమార్ ల కాంబోలో తెరకెక్కిన పుష్ప-ది రైజ్ చిత్రంపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రంపై విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. పుష్పరాజ్ గా బన్నీ లుక్…కథా, కథనం, పాటలు…ఇలా ఓ పవర్ ప్యాక్డ్ మూవీగా రాబోతోన్న పుష్ప కోసం బన్నీ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక, ఈ చిత్రంలో ఊ అంటావా మావా…అంటూ సమంత ఓ రేంజ్ లో రెచ్చిపోయిన ఐటం సాంగ్ యూట్యూబ్ లో సునామీ రేపుతోంది. అయితే, ఈ పాటవల్ల మా మనోభావాలు మంటగలిసాయంటూ పురుషుల సంఘం కోర్టును ఆశ్రయించిందంటూ పుకార్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై సినీ నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది. పుష్పలో ని సామీ…సామీ పాట తన మనోభావాలు దెబ్బతీసిందంటూ మాధవీ లత షాకింగ్ కామెంట్లు చేసింది.
పుష్పలో సమంత పాట మీద కేస్ పెట్టారని, కానీ, ఆ లెక్కన ఇండస్ట్రీలో 98 శాతం పాటలు అలానే ఉంటాయని మాధవీ లత తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. అలా మనోభావాలు దెబ్బతినకూడదనుకుంటే పాటలు లేని సినిమా చేయాలని అభిప్రాయపడింది. తాను కూడా రారా సామీ సాంగ్ మీద కేసు వేస్తానని షాకింగ్ కామెంట్లు చేసింది. ఒక మగాడిని చూస్తే అమ్మాయి అంత చులకనగా వెంటపడి వెళ్లిపోద్దా? అబ్బాయి నడిచినచోట భూమిని మొక్కుతుందా? అని ప్రశ్నించింది. ఒక మహిళ పరువు పోయిందని, అది తనకు నచ్చలేదని, తాను కూడా నేను పెడతానని, తగ్గేదేలే అంటూ పోస్ట్ పెట్టింది.