పెద్దగా భారీ సినిమాలు రిలీజయ్యే అవకాశం లేని ఈ వేసవిలో.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న మిడ్ రేంజ్ చిత్రాల్లో మ్యాడ్ స్క్వేర్ ఒకటి. 2023లో విడుదలై సూపర్ సక్సెస్ అయిన మ్యాడ్ మూవీకి ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. మార్చి 29న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేసింది చిత్ర బృందం. ఐతే ఇప్పుడు డేట్ మార్చారు.
అలా అని సినిమాను వాయిదా వేస్తున్నారేమో అని మ్యాడ్ స్క్వేర్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులేమీ కంగారు పడాల్సిన పని లేదు. అనుకున్న దాని కంటే ఒక రోజు ముందే ఈ చిత్రం థియేటర్లలోకి దిగబోతోంది. మార్చి 28నే తమ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపాడు. డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకే ఈ మార్పు చేసినట్లు అతను వెల్లడించాడు. మార్చి 29న అమావాస్య కావడంతో ఆ రోజు రిలీజ్ వద్దని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడ్డారని.. అందుకే ఒక రోజు ముందే తమ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని నాగవంశీ వెల్లడించాడు.
మార్చి 28న రాబోతున్న రాబిన్ హుడ్ మూవీ కూడా బాగా ఆడాలని, తెలుగు సినిమాకు అది మరపురాని తేదీగా మారాలని నాగవంశీ ఆకాంక్షించాడు. ఇటు రాబిన్ హుడ్, అటు మ్యాడ్ స్క్వేర్ మార్చి 28కి ఫిక్స్ అయిన నేపథ్యంలో అదే రోజుకు ఫిక్స్ అయిన భారీ చిత్రం హరిహర వీరమల్లు వాయిదా పడబోతున్నట్లే. మధ్యలో కొన్ని రోజులు ప్రమోషన్ల పరంగా సందడి చేసిన ఆ చిత్ర బృందం ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. అయినా సరే.. మార్చి చివరి వారంలో బాక్సాఫీస్ రష్ గట్టిగానే ఉండబోతోంది.
తమిళం నుంచి విక్రమ్ సినిమా వీర ధీర సూరన్, మలయాళం నుంచి ఎంపురన్ రేసులో నిలవబోతున్నాయి. ఆ రెండు చిత్రాలూ తెలుగులో కూడా విడుదల కానున్నాయి. మరోవైపు సల్మాన్ ఖాన్ హిందీ చిత్రం సికందర్ కూడా మార్చి నెలాఖర్లోనే విడుదల కాబోతోంది. మొత్తానికి మార్చి లాస్ట్ వీకెండ్ సినిమాలతో వేసవి సీజన్ ఘనంగానే ఆరంభం కాబోతున్నట్లు కనిపిస్తోంది.