పందెం రాయుళ్లు.. అవకాశమున్న ప్రతి సందర్భాన్ని బెట్టింగ్‌లకు అవకాశంగా మలుచుకుంటారు. ఇప్పుడు పందెం రాయుళ్ల కళ్లు ‘మా’ ఎన్నికలపై పడ్డాయి. మీడియాలో ‘మా’ ఎన్నికలకు విస్తృత ప్రచారం లభించడంతో ప్రజల్లో ఈ ఎన్నికల పట్ల ఆసక్తి పెరిగింది. సినిమా వాళ్లంటేనే ప్రజల్లో ఉండే సహజమైన ఆసక్తికి తోడు ఇలా ఎన్నికల్లో జరగడం, తలపండిన రాజకీయనాయకులను మించి వారు ధూషణ, భూషణలకు దిగుతుండటంతో ఈ తమాషా మొత్తాన్ని ప్రజలు ఉత్కంఠగా గమనిస్తున్నారు.
మీడియా కూడా ఈ ఎన్నికలకు కావాల్సినంత ప్రచారాన్ని కల్పించింది. సినిమాలు అంటే ఏమాత్రం ఆసక్తి ఉన్న ఏ ఇద్దరి మధ్య ప్రస్తుతం ఎన్నికల గురించే చర్చ నడుస్తోంది. మా ఎన్నికల్లో విష్ణు గెలుస్తారా.. ప్రకాశ్ రాజ్ గెలుస్తారా? ఇది ప్రస్తుతం మిలియన్ డాటర్ల ప్రశ్నగా మిగిలింది. వాడివేడిగా సాగిన మా ఎన్నికలను అదునుగా పందెం రాయుళ్లు ‘కాయ్ రాజా కాయ్’ అంటూ బెట్టింగ్‌లకు దిగుతూ జేబులు నింపుకుంటున్నారు.
మా ఎన్నికల్లో విష్ణు గెలుస్తారా.. ప్రకాశ్ రాజ్ గెలుస్తారా? ఇలా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిపైనే కాకుండా ప్యానల్లోని సభ్యులపై కూడా పందెలు కాస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. విష్ణు గెలిస్తే 10కి 8 అని, ప్రకాశ్ రాజ్ గెలిస్తే 10కి 12 అని బెట్టింగ్ రాయుళ్ళు రెచ్చిపోతున్నారని చెబుతున్నారు. గుట్టుచప్పడు కాకుండా నటీనటులు, దర్శకులు నిర్మాతలు బెట్టింగ్ వేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోటీలో ఉన్న ఓ ప్యానల్ సభ్యుడు లక్షల కొద్దీ బెట్ వేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మా ఎన్నికల్లో నటుడు ప్రకాశ్ రాజ్, హీరో మంచు విష్ణు అధ్యక్ష పదివికి పోటీ పడుతున్నారు. ప్రకాశ్ రాజ్‌ను మెగా ప్యామిలీ సపోర్టు చేస్తోంది. ఇక మంచు విష్ణుకు తన మోహన్‌బాబుతో పాటు సీనియర్ నటులు మద్దుతు నిలిచారు. ఇరువురు హోరాహోరీగా ప్రచారం చేశారు. నిన్నటి వరకు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు.
మొదట ప్రకాశ్ రాజ్ గెలుపు నల్లెరు మీద నడకలా సాగుతుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు విష్ణు సిద్ధమయ్యారు. దీంతో అప్పటివరకు ఉన్న అంచానాలన్నీ తలకిందులయ్యాయి.
అందరూ అనుకున్నట్లే ‘మా’ చరిత్రలో కనివిని ఎరుగని రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగింది. మొత్తం 605 మంది నటీనటులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి మొత్తం 665 ఓట్లు పోలయ్యాయి. ‘మా’ ఎన్నికల్లో 75.3 శాతం పోలింగ్ నమోదయిందని అధికారులు తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి భారీగా పోలింగ్ శాతం పెరిగిందని చెబుతున్నారు.
గత ఎన్నికల్లో 468 మంది సినీనటులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే కొందరు సినీ ప్రముఖులు ఓటు వేయకుండా ఇంట్లోనే కూర్చున్నారు. ప్రభాస్, మహేష్‌బాబు, వెంకటేష్, రానా, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నితిన్, నాగ చైతన్య, అనుష్క, రకుల్, హన్సిక, త్రిష, ఇలియానా ఓటు వేసేందుకు విముఖత వ్యక్తం చేశారు.