తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు జరిగితే ఎంత రసవత్తరంగా ఉంటాయో ? ఇప్పుడు తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలు కూడా అంతకు మించి రసవత్తరంగా మారాయి. ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా..
ప్రకాష్‌రాజ్‌కు మెగా కాంపౌండ్ సపోర్ట్ ఉంటే.. ఇటు మంచు ఫ్యామిలీకి సీనియర్ నటులు, జగన్ ఒత్తిడితో మెజార్టీ సభ్యులు సపోర్ట్ చేస్తున్నారు. దీంతో మా ఎన్నికలపై అటు మీడియా వర్గాలకే కాకుండా… ఇటు సినీ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి ఏర్పడింది. అయితే మా ఎన్నికలలో రాజకీయ పార్టీల ప్రమేయంపై కూడా రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
విష్ణు అధికారికంగా వైసీపీలో ఉన్నారు. ప్రకాష్‌రాజ్ బీజేపీకి బద్ధ వ్యతిరేకి. పైగా ఆయన తెలంగాణలో అధికార టీఆర్ఎస్తో పాటు యువనేత, మంత్రి కేటీఆర్‌తో అత్యంత సన్నిహితంగా ఉంటారు. అయితే ఇక్కడే మరో ఆసక్తికర ప్రచారం కూడా జరుగుతోంది.
ఈ ఎన్నికలలో విష్ణు గెలుపు కోసం ఏపీ సీఎం జగన్‌తో పాటు వైసీపీ వర్గాలు తెరవెనక చాలా కథ నడిపిస్తున్నాయంటున్నారు. జగన్ ఆశీస్సులతోనే విష్ణు ఈ సారి ఎన్నికల బరిలో ఉన్నారని కూడా అంటున్నారు. అయితే ఈ ప్రచారం మరీ ఎక్కువ అవ్వడంతోనే ఏపీ మంత్రి పేర్ని నాని .. మా ఎన్నికలకు తమకు సంబంధం లేదని చెప్పారు.
అయితే ఇదంతా పైకి మాత్రమే అని.. ఇండస్ట్రీకి చెందిన పలువురు మంత్రి నానిని కలవడం వెనక కూడా విష్ణుకు సపోర్ట్ చేసే వ్యూహంలో భాగమే అంటున్నారు. విష్ణు ఈ ఎన్నికల బరిలోకి దిగడానికి కొద్ది రోజుల ముందే మంచు మనోజ్ జగన్‌ను కలిసి.. ఆయనో విజనరీ ముఖ్యమంత్రి అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
ఇక ఇండస్ట్రీ పెద్దలకు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అదే అపాయింట్మెంట్ మనోజ్‌కు ఎలా ? దొరికిందో తెలియదు. ఇక ఎన్నికల్లో ముందు జీవిత, హేమ, సీవీఎల్. నరసింహారావు పోటీ పడినా తర్వాత వారంతా ప్రకాష్‌రాజ్ ఫ్యానెల్లో చేరిపోయారు.
ఇక విష్ణు ఏకగ్రీవానికి ఒప్పుకోకుండా పోటీలో ఉండడం వెనక వైసీపీ బలమైన సపోర్ట్ ఉండడం వల్లే అంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్‌ను, ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. అదే సమయంలో విష్ణు ప్రకాష్‌రాజ్‌ను ఉద్దేశించి మీరు పవన్ వైపా ? ఇండస్ట్రీ వైపా ? అని ప్రశ్నించారు.
ఇక్కడ విష్ణు పరోక్షంగా పవన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక ముందునుంచే మెగా కాంపౌండ్ ప్రకాష్రాజ్కే సపోర్ట్ చేస్తోంది. దీంతో ఓ వర్గం మీడియా ఇక్కడ ప్రకాష్‌రాజ్ ఓడిపోతే చిరంజీవి ఓడిపోయినట్టే అని అంటుంటే.. వ్యతిరేక వర్గం వాళ్లు విష్ణు ఓడిపోతే జగన్ ఓడిపోయినట్టే అంటున్నారు. ఇక విష్ణు వర్గంలో పోటీపడుతోన్న పృథ్వితో పాటు పలువురు వైసీపీ అనుకూలురే..! మరి ఈ ఎత్తులు, పై ఎత్తుల వార్‌లో అంతిమంగా ఎవరు పై చేయి సాధిస్తారో ? చూడాలి.