తిప్పి తిప్పి కొడితే వెయ్యి మంది కూడా లేని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ నెల పదిన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం.. గతంలో ఎప్పుడూ జరగనంత రచ్చ తాజాగా సాగుతోంది. సాధారణ రాజకీయ ఎన్నికకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఎత్తులు.. పైఎత్తులే కాదు.. నోట్ల కట్టలతో పాటు.. ఇతరత్రా అంశాలు కూడా తెర మీదకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఇదంతా పైకి కనిపించనప్పటికీ.. ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకోవటం తెలిసిందే. ఇప్పుడు ఆ స్థాయిని కూడా దాటి పోయి ఒకరిపై ఒకరు తిట్ల వర్షాన్ని కురిపించుకోవటం మొదలైంది. రాయలేని భాషను.. ప్రస్తావించలేని విషయాల్ని కూడా బాహాటంగా బయటకు తెచ్చేసి.. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన దుస్థితి.
ఇప్పుడున్న రచ్చ సరిపోనట్లుగా తాజాగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృథ్వీ ఎంట్రీ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ కు వ్యతిరేక వర్గం తరఫున తన వాదనను వినిపించేందుకు ఆయన ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే.
రావటం రావటంతోనే నాన్ లోకల్ అంటూ నేరుగా అందరూ తప్ప పట్టే అంశాన్ని కెలికేశారు. దేశంలో ఎవరు ఎక్కడ నుంచైనా పోటీ చేయొచ్చు కానీ పాలించే అర్హత మాత్రం ఉండదంటూ అతను చేసిన వ్యాఖ్యలు మంట పుట్టిస్తున్నాయి. అంతేకాదు.. ప్రకాశ్ రాజ్ ను విజయవాడకు తీసుకొచ్చి సన్మానించటాన్ని తప్పు పట్టారు. తెలుగు నటులు ఎంతోమంది ఉండగా.. ఎక్కడి నుంచో వచ్చిన ఆర్టిస్ట్ కు సన్మానం చేయటంబాధ కలిగిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆడియోలోనిమాటలు హాట్ టాపిక్ గా మారాయి.
ఇప్పటివరకు ఈ తరహా వ్యాఖ్యలు చేసింది లేదు. తనకు వైజాగ్ తో మంచి అనుబంధం ఉందని.. అక్కడ ఎంతో మంది సన్నిహితులు ఉన్నారని.. తన రాజకీయ జీవితం మొదలైంది కూడా అక్కడే. ‘ప్రకాశ్ రాజ్ ను సన్మానించటం నచ్చలేదు. ఎక్కడి నుంచో వచ్చిన అతనికి ‘మా’ ఎన్నికల కోసం మీరెలా సపోర్టు చేస్తారు. అతనికి క్రమశిక్షణ లేదని చాంబర్ రెండు సార్లు అతన్ని సస్పెండ్ చేసిందన్న విషయాన్ని గుర్తు చేశారు.
తాను కన్నడలోఒక షూటింగ్ చేస్తున్నప్పుడు కన్నడ వాళ్లు మాత్రమే చేయాలంటూ తనపై కేకలు వేశారన్నారు. ‘ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. కానీ మనల్ని పాలించకూడదు. మీకు ఆయన ఎందుకు నచ్చాడు? పరభాషా నటుల మీద మీకు అంత ఇష్టమేంటి? తెలుగువాడిని గెలిపిద్దాం. తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం’ అంటూ తన వాయిస్ తో ఒక ఆడియోను విడుదల చేశాడు.
ఒకవేళ.. పృథ్వీ మాటల్నే ప్రాతిపదికగా తీసుకుంటే.. రేపొద్దు తెలంగాణకు చెందిన సినీ రంగానికి చెందిన వారు సరిగ్గా పృథ్వీ మాటలైన ‘ఎవరైనా పోటీ చేయొచ్చు. పాలనా అధికారం మాత్రం తెలంగాణ వారికి మాత్రమే ఇవ్వాలన్న డిమాండ్ ను తెర మీదకు తీసుకొస్తే.. ఇప్పుడు రంగంలో ఉన్న వారెవరికి పోటీ చేసే అవకాశం ఉండదన్న విషయాన్ని మర్చిపోకూడదు.
కెలికి మరీ తిట్టించుకునేలా పృథ్వీ వ్యవహారశైలి ఉందని చెప్పక తప్పదు. ఇప్పటికే ‘మా’ ఎన్నికల ప్రచారం అంతకంతకూ అధమ స్థాయికి దిగజారిపోతున్న వేళ.. పృథ్వీ మాటలు మరింత డ్యామేజింగ్ గా మారటం ఖాయం. మొత్తంగా..పృథ్వీ మాటలు కొత్త రచ్చకు ఖాయమని చెప్పక తప్పదు.