ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పేరొందిన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థా లూత్రా ఈ కేసు వాదిస్తుండటంతో రాజకీయ వర్గాల్లోనే కాకుండా న్యాయవర్గాలలోను బాబు అరెస్టు- బెయిల్ ఎపిసోడ్ కీలకంగా మారింది. అయితే తాజాగా లూత్రా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. `న్యాయం దక్కనప్పుడు కత్తి పట్టాల్సిందే` అంటూ ఆయన చేసిన ట్వీట్ కలకలం రేకెత్తిస్తోంది.
స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ లో భాగంగా అవినీతికి పాల్పడ్డారు అంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఏపీ సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పక్కాగా వాదించేందుకు సిద్ధార్థా లూత్రాను తెలుగుదేశం పార్టీ ఢిల్లీ నుంచి పిలిపించింది. సుప్రసిద్ధ న్యాయవాదిగా పేరొందిన, తన క్లయింట్లకు న్యాయం చేస్తాడనే గుర్తింపు, ఇందుకు గాను రోజుకు దాదాపు కోటికిపైగా వసూలు చేస్తారనే ప్రముఖుడిగా పేరొందిన లూత్రా మొదటి వాదనలో చంద్రబాబుకు బెయిల్ ఇప్పించలేకపోయారు. తదుపరి జరిగినా పలు వాదనల్లోనూ చంద్రబాబుకు బెయిల్ దక్కలేదు. దీంతో లూత్రా సామర్థ్యంపై పలువురు సోషల్ మీడియా వేదికగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఇంకొందరు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే, ఇలాంటి సమయంలోనే లూత్రా కలకలం రేపే ట్వీట్ చేశారు.
ట్విట్టర్ వేదికగా స్పందించిన లూత్రా గురు గోవింద్ సింగ్ చెప్పిన మాటను ఓటంకిస్తూ కత్తి పట్టడాన్ని ప్రస్తావించారు. `అన్ని విధాల ప్రయత్నించినప్పటికీ, కనుచూపు మేరలో న్యాయం కనిపించినప్పుడు కత్తితో పోరాటమే సరైనది` అని గురు గోవింద్ సింగ్ మాటలు పేర్కొంటూ మోటో ఫర్ ది డే అనే ట్యాగ్‌లైన్‌తో ట్వీట్ చేశారు. న్యాయం కోసం పోరాటం చేయాల్సిన వ్యక్తి కత్తి పట్టాలి అని కామెంట్ చేయడం ఏమిటంటూ లూత్రా ట్వీట్‌పై సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు బాబు ప్రతిపక్ష వర్గాలు. చంద్రబాబును బయటకు తీసుకొస్తామని లూత్రా చేసిన ప్రయత్నం ఫలితం ఇవ్వలేకపోవడంతో ఇలా తన ఫ్రస్టేషన్ వ్యక్తం చేస్తున్నారంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా సుప్రసిద్ధ న్యాయవాది అయిన లూత్రా ఈ విధంగా ట్వీట్ చేయడం తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పడేసే అంశమేనని ఇంకొందరు పెదవి విరుస్తున్నారు.