ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ 2009లో శ్రీలంక ఆర్మీ చేతిలో చనిపోయారన్న సంగతి తెలిసిందే. శ్రీలంక సైన్యంతో జరిగిన పోరులో ప్రభాకరన్ తో పాటు ఆయన తనయుడిని కూడా సైనికులు మట్టుబెట్టారు. ప్రభాకరన్ మృతదేహం ఫొటోలను కూడా లంక సైన్యం విడుదల చేసింది. ఇటువంటి నేపథ్యంలో ఆ ఘటన జరిగిన 14 ఏళ్ల తర్వాత శ్రీలకం ఆర్మీకి మోస్ట్ వాంటెడ్ ప్రభాకరన్ బతికే ఉన్నారంటూ ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ నేత నెడుమారన్ సంచలన ప్రకటన చేశారు.
అంతేకాదు, త్వరలోనే ప్రభాకరన్ బయటకు వస్తారని, ఈలం తమిళుల మెరుగైన జీవనం కోసం ప్రకటన చేయబోతున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు.శ్రీలంకలో ప్రజా తిరుగుబాటు, రాజపక్ష రాజీనామా వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభాకరన్ మళ్లీ లంకకు రావడానికి ఇదే సరైన సమయమని ఆయన చెప్పారు. ఇక, ప్రభాకర్ కు ఈలం తమిళులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళుల సంపూర్ణ మద్దతు కావాలని ఆయనని కోరారు. దాంతోపాటు, ప్రభాకరన్ కు తమిళనాడు ప్రభుత్వం, తమిళ రాజకీయ పార్టీలు, తమిళనాడు ప్రజలు తోడుగా నిలవాలని చెప్పారు.
ఇక, తన కుటుంబసభ్యులతో ప్రభాకరన్ టచ్ లో ఉన్నారంటూ నెడుమారన్ షాకింగ్ న్యూస్ చెప్పారు. ప్రభాకరన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, కానీ, ఆయన ఎక్కడ ఉన్నారన్న వివరాలను తాను ఇప్పుడు బయటపెట్టలేనని అన్నారు. ఏది ఏమైనా, శ్రీలంక ఆర్మీకి మోస్ట్ వాంటెడ్ ఇంకా బ్రతికే ఉన్నాడంటూ నెడుమారన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడుతోపాటు శ్రీలంకలోనూ తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇంతకీ, ప్రభాకరన్ నిజంగానే బ్రతికి ఉన్నారా? లేక ఇదంతా పుకారా అన్న సంగతి తేలాల్సి ఉంది.