ఐకియా ఫర్నిచర్ షాపు ఓపెన్ చేస్తే హైదరాబాద్లో అనేక రోడ్లు జామ్, రోజుల తరబడి ట్రాఫిక్ మళ్ళింపు, వాళ్లకు టోకెన్లు, వెయిటింగ్! ఆధునిక సారాయి దుకాణం (imfl) అనగానే జనం కుప్పలు కుప్పలు! కేబుల్ బ్రిడ్జి ఓపెన్ చేశారంటే.. పోలోమని వెళ్లి సెల్ఫీలు తీసుకున్నారు. ఓట్లకుమాత్రం రారు.. అంత వేగంగా ‘పదండి తోసుకు..పదండి కుప్పల్లా రాకపోయినా ఫర్లేదు, ఎందుకనో కనీసం ఓటు హక్కు వినియోగించుకోవాలనే బాధ్యతగా రారు. వృద్దులే ఎక్కువ క్యూలో కనబడ్డారు. మొత్తం చేయిచ్చింది సాఫ్ట్వేర్ బాచ్ అంట. వీళ్ళే ఎక్కువ సోషల్ మీడియాలో ఓటు హక్కు గురించి అరివీరభయంకరముగా రెచ్చిపోయేది.
హైదరాబాదు నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోలింగ్ దాదాపు 42.4% అని ఈ పోస్టు వ్రాసేటప్పటికి వార్త. అంతిమంగా కొంత మార్పులు, చేర్పులు ఉండొచ్చు. అంటే ఓటింగ్ శాతం 2007 ఎన్నికలకంటే ఎక్కువ, 2019 పార్లమెంటు ఎన్నికలకంటే ఓ 3 శాతం తక్కువ. కడుపునిండిన న్యూయార్క్ లో 25% ఉండొచ్చుగానీ అనేక సమస్యలు ఉన్న హైదరాబాదులో ఇంత తక్కువ ఓటింగ్ ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. అడ్డమైన వాటికి తోసుకువెళ్ళేవాళ్ళు వీటికి వచ్చి ఓ గంట నుంచోలేరా?
అత్యవసరమైన కారణం ఉంటే తప్ప ఓటింగ్ కి రానివారికి ఏదైనా పరోక్షశిక్ష ఉండాలి. అయితే సరే.. మనకే ప్రజాస్వామ్య అవసరం అనుకుంటే.. ఓటింగ్ పెరగటానికి ఆన్ లైన్ ఓటింగ్ సిస్టం, లేదా అమెరికాలోలాగా పోస్టల్ బాలెట్ ప్రవేశపెట్టాలి, కాకపోతే దుర్వినియోగం కాకుండా ఇక్కడ గట్టి చర్యలు తీసుకోవాలి. ఆఖరుగా కుల, మత, ధన ప్రభావాలకు లొంగి నీతి, నిబద్దత ఉన్నవారిని ఎన్నుకోని ఓటర్ల గురించి.. వాళ్ళు రాకపోవడమే మంచిది.