హైదరాబాద్ శివారులో షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. తాను ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలి ఎంగేజ్ మెంట్ జరగటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు ప్రియుడు. అందుకు ప్రతిగా అతడు చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఏ మాత్రం సంబంధం లేని ఆమెకు కాబోయే వరుడు బాధితుడిగా మారాడు. ఇంతకూ జరిగిందమేమంటే.. హైదరాబాద్ శివారు అయిన మైలారు దేవురపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అమ్మాయి.. అబ్బాయి ప్రేమించుకున్నట్లు చెబుతున్నారు.
వారి ప్రేమ అమ్మాయి ఇంట్లో సుతారం ఇష్టం లేదు. దీంతో.. ఒక అబ్బాయితో సంబంధం మాట్లాడి ఓకే చేయటమే కాదు..ఎంగేజ్ మెంట్ పూర్తి చేశారు. వరుడు కూడా మైలారు దేవురపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే నదీమ్ ఖాన్. 28 ఏళ్ల ఇతడు బైక్ మీద వెళుతుండగా.. తాజాగా కిడ్నాప్ కు గురయ్యాడు. ఆమెకు కాబోయే భర్తను ఒక యువకుడు కిడ్నాప్ చేసినట్లుగా చెబుతున్నారు.
కుమార్తె ప్రేమాయణం తెలిసే.. కుటుంబ సభ్యులు వరుడికి ఈ విషయాలేమీ చెప్పకుండా గుట్టుగా ఎంగేజ్ మెంట్ చేసినట్లుగా సమాచారం. దీంతో.. ప్రియుడు తన ప్రియురాలికి కాబోయే భర్తను కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ కిడ్నాప్ ఉదంతాన్ని ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. నిజంగానే.. అమ్మాయి ప్రియుడు ఈ కిడ్నాప్ నకు పాల్పడ్డాడా? ఇంకేదైనా కారణం ఉందా? ఈ మొత్తం ఇష్యూలో అడ్డంగా ఇరుక్కున్న నదీమ్ ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేందుకు వీలుగా.. పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కిడ్నాప్ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.