ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. నిజానికి ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం రావడంతో వెంటనే వెనక్కి వచ్చింది. దీంతో ఢిల్లీ టూర్ రద్దవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఈ పర్యటన ముందుకే సాగింది. అయితే.. ఈ పర్యటనలో సీఎం జగన్ భారీ ఎత్తున పెట్టుబడులు తెస్తారని అందరూ భావిస్తున్నారు. వైసీపీ వర్గాలకు అయితే.. మరింత ఆశలు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టవచ్చని కూడా వారు అంచనా వేస్తున్నారు.
అయితే.. ఇప్పుడు జగన్ పర్యటనతో డిల్లీ నుంచి ఎలాంటి పెట్టుబడులు ఏపీకి తరలి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే.. ఇది కేవలం సన్నాహక సదస్సు! అంటే.. పెళ్లికి ముందు జరిగే పేరంటం లాంటిద న్న మాట! పెళ్లికి ఇంకా టైమ్ ఉందన్నమాట!. విషయం ఏంటంటే.. ఈ ఏడాది మార్చి 3,4 తేదీల్లో విశాఖ లో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సును ఏపీ ప్రభుత్వమే నిర్వహిస్తోంది.
ఈ గ్లోబల్ సమ్మిట్లో, బిజినెస్-టు-బిజినెస్ (B2B), బిజినెస్-టు-గవర్నమెంట్ (B2G) సమావేశాలు, కీలక ప్రసంగాలు, సెక్టార్-నిర్దిష్ట దేశ-నిర్దిష్ట ప్లీనరీ సెషన్లను నిర్వహించనున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసిన 13 కేంద్రీకృత రంగాలపై సెక్టోరల్ సెషన్లను నిర్వహించనున్నారు. ఇందులో వివిధ రంగాల పారిశ్రామిక నిపుణులు తమ అనుభవాలను పంచుకొనున్నారు.
అయితే.. దీనికి ముందు.. విశాఖలో జరిగే.. ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల్లోని పారిశ్రామిక వేత్తలను ఆకర్షిం చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తొలుత ఢిల్లీలో ఈ సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. తర్వాత.. వరుసగా హైదరాబాద్, బెంగళూరు, పట్నా సహా.. ముంబైలలోనూ ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. సో.. మొత్తంగా చూస్తే.. దీనికే భారీ ఎత్తున రూ.కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఇక, మార్చిలో జరగనున్న పెట్టుబడుల అసలు సదస్సులో ఏమేరకు పెట్టుబడులు వస్తాయో చూడాలి.