సంక్రాంతికి భారీ అంచనాలతో విడుదలైన సినిమా.. గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు, అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సంక్రాంతికి సినిమా రిలీజైతే ప్రాంతీయ చిత్రాల్లో కొత్త రికార్డులు నమోదవుతాయనే ట్రేడ్ పండిట్లు అంచనా వేశారు. ఈ సినిమాకు బిజినెస్ కూడా రికార్డు స్థాయిలోనే జరిగింది. రిలీజ్ ప్లానింగ్ అంతా పక్కాగా చేశారు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండి ఉంటూ కచ్చితంగా రికార్డులు బద్దలయ్యేవే.
కానీ డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. ఓ మోస్తరు ఫలితాన్నే అందుకుంది. మిడ్ నైట్ షోలకు వచ్చిన నెగెటివ్ ఫీడ్ బ్యాక్‌తో పోలిస్తే సంక్రాంతి సీజన్‌ను ఉపయోగించుకుని ‘గుంటూరు కారం’ బాక్సాఫీస్ దగ్గర మెరుగ్గానే పెర్ఫామ్ చేసింది. కానీ టార్గెట్లు మరీ పెద్దవి కావడంతో ఈ సినిమా అంతిమంగా సక్సెస్ ఫుల్ ఫిలిం అనిపించుకోలేకపోయింది.
ఆంధ్రా ప్రాంతాల్లో ‘గుంటూరు కారం’ బాగానే ఆడింది. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. కొన్ని ఏరియాల్లో ఆ మార్కుకు సినిమా దగ్గరగా వెళ్లింది. కానీ మిగతా చోట్ల అంతా ‘గుంటూరు కారం’ నష్టాలనే మిగిల్చినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. సీడెడ్ ఏరియాలో బయ్యర్లకు గట్టి దెబ్బే పడింది. రూ.14 కోట్లకు హక్కులు కొంటే.. షేర్ పది కోట్ల లోపే వచ్చింది.
నైజాం ఏరియాలో మాగ్జిమం స్క్రీన్లు, అదనపు రేట్లతో బయ్యర్ దిల్ రాజు రిలీజ్ పక్కాగానే ప్లాన్ చేసుకున్నాడు కానీ.. అయినా సరే ఆయనకు నష్టం తప్పలేదని తెలుస్తోంది. వైజాగ్ ఏరియాకు ఆయన పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చింది కానీ నైజాంలో మాత్రం ఆరేడు కోట్ల దాకా నష్టం అంచనా వేస్తున్నారు. యుఎస్‌లో కూడా సినిమా బయ్యర్‌కు కొన్ని కోట్ల నష్టం మిగిల్చింది.