వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ నేతలు విన్నపాల మీద విన్నపాలు సమర్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓం బిర్లాకు అనేకసార్లు ఫిర్యాదు చేసిన వైసీపీ ఎంపీలు…ఇటీవల ఢిల్లీ వెళ్లి మరోసారి ఈ విషయంపై స్పీకర్ ను కలిశారు. అయితే, రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్ వ్యవహారంపై రన్నింగ్ కామెంటరీ చేయలేమని, ప్రక్రియ, పద్ధతి ప్రకారమే ఆ పిటిషన్ పై చర్యలు తీసుకుంటామని ఓం బిర్లా స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా రఘురామకు స్పీకర్ ఓం బిర్లా లేఖ రాశారు. రఘురామను అనర్హుడిగా ప్రకటించాలని వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై అభిప్రాయాన్ని తెలపాలని కోరారు. అంతేకాదు, ఈ వ్యవహారంపై రఘురామ 15 రోజుల్లో అభిప్రాయం వెల్లడించాలని పేర్కొన్నారు. అయితే, రఘురామతో పాటు మరో ఇద్దరు ఎంపీలకు కూడా రఘురామ లేఖ రాశారు. టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన బెంగాల్ ఎంపీలు శిశిర్ అధికారి, సునీల్‌కుమార్ మండల్ లు కూడా 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు.
అయితే, తనకు స్పీకర్ లేఖ అందాల్సి ఉందని రఘురామకృష్ణరాజు చెబుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ ఎంపీలు తహతహలాడుతున్నారని, దానికి బదులుగా రాష్ట్ర హక్కుల కోసం, ప్రత్యేక హోదా కోసం పోరాడేలా ఎంపీలకు దిశానిర్దేశం చేయాలని జగన్‌కు రఘురామ సూచించారు. తనపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ ఎంపీలు చాలా తొందరపడుతున్నారని చుకరకలంటించారు.