ఈ టెక్ జమానాలో ఫ్యాషన్ వెర్రితలలు వేస్తోన్న సంగతి తెలిసిందే. కొత్తకు వింత…పాతకు రోత అన్న చందంగా వినూత్న ఆలోచనలతో వస్తువులను మార్కెంటింగ్ చేస్తున్నారు వ్యాపారవేత్తలు. కొత్త ఐడియాలు…కొత్త ఆలోచనలు శ్రుతిమించనంతవరకు మంచివే. కానీ, కొందరు తమ పైత్యాన్ని క్రియేటివిటీ అనుకొని భ్రమపడి….చేసే తిక్క పనుల వల్ల ఇరకాటంలో పడుతుంటారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ చేసిన ఓ పని కూడా ఈ కోవలోకే రావడంతో ఆ వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
పాశ్చాత్య దేశాలకు చెందిన పలు కంపెనీలు హిందూ దేవతలు, దేవుళ్ల ఫొటోలను డోర్ మ్యాట్లు, చెప్పులపై ముద్రించి అవమానించిన ఘటనలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ మధ్య కాలంలో ఆ తరహా పైత్యపు కార్యక్రమాలు తగ్గాయి. అయితే, తాజాగా సోషల్ మీడియాలోని ఎమోజీలలోనూ ఈ తరహా పైత్యం కనబడడం చర్చనీయాంశమైంది. ఇన్ స్టాగ్రామ్ లో హిందువులు పరమ పవిత్రంగా పూజించే పరమ శివుడి స్టిక్కర్ ను అవమానకరరీతిలో చిత్రీకరించిన ఘటన దుమారం రేపుతోంది. జిఫ్ ఫార్మాట్లో ఉన్న శివుడి స్టిక్కర్ ను అనుచిత రీతిలో ఆ యాప్ చిత్రీకరించినట్లు ఢిల్లీకి చెందిన బీజేపీ నేత మనీష్ సింగ్ గుర్తించారు.
ఒక చేతిలో మద్యం గ్లాసు, మరో చేతిలో మొబైల్ ఫోన్‌తో కన్న కొడుతున్న శివుడి జిఫ్ ఇమేజ్ స్టికర్‌ను ఇన్‌స్టాలోని స్టోరీ సెక్షన్లో ఉంచడంపై మనీష్ మండిపడ్డారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పార్లమెంట్ వీధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇన్స్టాగ్రామ్ సీఈవో, ఇతర అధికారులపై ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లోని సెర్చ్ బాక్స్‌లో shiv అని టైప్ చేసిన యూజర్‌కి ఈ స్టికర్ దర్శనమిస్తోందని మనీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే ఆ జిఫ్‌ను తయారు చేసినట్లుందని ఫిర్యాదులో ఆరోపించారు. శివుడిని అవమానకర రీతిలో చిత్రీకరించిన ఇన్స్టాగ్రామ్ సీఈవోపై క్రిమినల్ కేసు పెట్టాలని కోరారు. మరి, ఈ వ్యవహారంపై ఇన్ స్టాగ్రామ్ సీఈవో ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.