రాష్ట్రాభివృద్ధిని, విభజన హామీల అములును దృష్టిలో పెట్టుకుని లోక్ సత్తా జాతీయ కన్వీనర్ జయప్రకాష్ నారాయణ పార్లమెంటుకు ఎన్నిక అవ్వాల్సిన అవసరం చాలావుందని ఆ పార్టీ తీర్మానం చేసింది. కలిసొచ్చే పార్టీలతో వేదికను పంచుకునేందుకు తమపార్టీ సిద్ధంగా ఉందని కూడా లోక్ సత్తాపార్టీ రాష్ట్రకమిటి తీర్మానం చేయటమే ఆశ్చర్యంగా ఉంది. ఏపీ బాగుపడాలంటే జేపీ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించాల్సిందే అని రాష్ట్రకమిటి తేల్చేసింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసలు లోక్ సత్తాను రాజకీయపార్టీగా జనాలు ఎవరైనా గుర్తిస్తున్నారా అన్నది అర్దం కావటంలేదు. ఈపార్టీని జనాలు ఏమాత్రం పట్టించుకోవటంలేదు. ఒకపుడు అంటే 2009 ఎన్నికల్లో కాస్త హడావుడి జరిగిందంతే. జేపీ కుకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో గెలవటంతో హడావుడి కూడా తెలంగాణాలో కనబడింది. తర్వాత 2014లో మల్కాజ్ గిరి పార్లమెంటుకు పోటీచేసి ఓడిపోయారు.
ఆ తర్వాత జేపీని పెద్దగా పట్టించుకున్నవారే లేరు. ఏదో అప్పుడప్పుడు మీడియాతో మాట్లాడినపుడు కాస్త హైలైట్ అవుతున్నారంతే. అలాంటి జేపీ పార్లమెంటుకు ఎన్నికవుతారని పార్టీ ఎలాగ అనుకున్నదో. కలిసొచ్చే పార్టీలంటే లోక్ సత్తా పార్టీ అర్ధమేంటో కూడా తెలీటంలేదు. లోక్ సత్తాకు ఏముందని ఏ పార్టీఅయినా కలిసొస్తుంది. బహుశా బీజేపీ-జనసేనతో చేతులు కలిపే అవకాశముందంతే. ఎందుకంటే ఈ రెండుపార్టీలు కూడా దాదాపు లోక్ సత్తా పరిస్ధితిలోనే ఉన్నాయికాబట్టి.
క్షేత్రస్ధాయిలో వాస్తవాలను మరచిపోయి తమను తాము చాలా ఎక్కువగా ఊహించుకుంటే ఇలాంటి ప్రతిపాదనలే వినిపిస్తుంటాయి. జేపీ లోక్ సత్తాను కాదని ఇంకేదైనా పార్టీలో చేరితే అప్పుడు జనాలు కొన్ని ఓట్లేసే అవకాశముంది. జేపీ అలాచేసే అవకాశం దాదాపు లేదుకాబట్టి ఎక్కడ నిలబడినా గెలుపు కాదుకదా కనీసం డిపాజిట్ దక్కేది కూడా అనుమానమే. ఇలాంటి జేపీ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరం చాలా ఉందని పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేయటమే విచిత్రంగా ఉంది. మేథావిగా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎంపికయ్యే అవకాశమైతే ఉంది కానీ లోక్ సభకు పోటీచేసి గెలవటం మాత్రం దాదాపు అసాధ్యమే.