టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం రాత్రి మంగళగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా లోకేష్ కు స్థానిక టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో స్వాతంత్ర దినోత్సవ నాడు లోకేష్ పాదయాత్రను చేయబోతున్నారు. అంతకుముందు తాడికొండ నియోజకవర్గంలో ఆడిటర్లతో సమావేశమైన లోకేష్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగిపోయిన గ్రోత్ ఇంజన్ స్టార్ట్ చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
భారీ పరిశ్రమలు తీసుకువచ్చి ఆడిటర్ల, సీఏల సమస్యలకు పరిష్కారం చూపిస్తామని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయని, ఆల్రెడీ ఉన్న కంపెనీలు కూడా పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నాయని అన్నారు. ఆడిటర్లు ,సీఏలు కూడా జగన్ బాధితులేనని, కంపెనీలు, ఇండస్ట్రీలు లేక ఆడిటర్లకు చేతినిండా పనిలేదని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి అధికారంలోకి రాగానే ఆడిటర్లకు ప్రొఫెషనల్ టాక్స్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ తీసిన విధంగా రాష్ట్ర పరువును ఏ ముఖ్యమంత్రి తీయలేదని, ఇంత చెత్త పరిపాలన గతంలో ఎన్నడూ లేదని లోకేష్ మండిపడ్డారు.
అమర్ రాజా, ఫాక్స్ కాన్ కంపెనీలను వేధింపులకు గురిచేసి పొరుగు రాష్ట్రాలకు తరిమేశాడని, జగన్ తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో కూరుకుపోయిందని విమర్శించారు. ఏపీలో పేపర్లు చూస్తే కక్ష సాధింపు చర్యలు, ప్రతిపక్ష నేతలపై దాడులు, అత్యాచార వార్తలు, డ్రగ్స్ కేసులు కనిపిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాల పేపర్లు చూస్తే పెట్టుబడులు, కొత్త కంపెనీల రాకలు కనిపిస్తాయని అన్నారు. గాడి తప్పిన ఏపీని చంద్రబాబు మళ్ళీ గాడిలో పెడతారని అన్నారు. స్టాన్ఫోర్డ్ లో చదువుకున్న తాను మంగళగిరిలో ఓడిపోయానని, క్వాలిఫికేషన్ తో పాటు ప్రజలతో మమేకం అవ్వడం, వారికి దగ్గర కావడం కూడా ముఖ్యమని లోకేష్ ఎంతో పరిపక్వతతో మాట్లాడారు. రామోజీరావుపై కక్ష సాధించేందుకే మార్గదర్శిని టార్గెట్ చేసి జగన్ వేధిస్తున్నాడని అన్నారు.