యువగళం.. టీడీపీ యువ నాయకుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రతిష్టాత్మక పాదయాత్ర. సు మారు 400 రోజుల పాటు.. 4వేల కిలో మీటర్ల దూరాన్ని నడిచి.. ప్రజలను తనవైపు తిప్పుకోవాలనేది ప్రధాన అజెండా. ఇక్కడ పార్టీ కన్నా కూడా నాయకుడిగా తనను తాను నిరూపించుకుని తీరాలనేది.. ముఖ్యంగా యూత్ ను తనవైపు తిప్పుకోవాలనేది యువగళంలో పెట్టుకున్న లోకేష్ ప్రధాన అజెండా!
ఈ క్రమంలో గత నెల 27న ప్రారంభించిన ఈ యాత్రకు నెల రోజులు పూర్తయ్యాయి. ఈ నెల రోజుల్లో మూడు రోజుల విరామం తీసేస్తే.. మిగిలిన 28 రోజులు కూడా బాగానే సాగింది. అయితే.. లోకేష్ అనుకున్నట్టు యు వత ఆయన వైపు మొగ్గు చూపుతున్నారా? వారి ఓట్లు ఆయనకు అనుకూలంగా పడుతున్నాయా? అనేది ఇప్పుడు ప్రశ్న. రాజకీయాల్లోఇప్పుడు స్టయిల్ మారిపోయింది. నువ్వు ఒకటంటే నేను పదంటా! అనే కాన్సెప్టును నేతలు అమలు చేస్తున్నారు.
ఇది పైకి బాగానే ఉంటుంది. ప్రచారం కూడా జరుగుతుంది. మీడియా పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ కూడా ఇస్తోంది. అయితే.. ఇది ఎంత వరకు ఓట్లు తీసుకువస్తుంది? అనేది ప్రశ్న. ఇప్పటి వరకు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి మాత్రమే ఈ తరహా రాజకీయాలు కలిసి వచ్చాయి. దీనికి కారణం అక్కడ బలమైన నాయకుడు లేకపోవడం. ఇక, ఇదే పంథాను నారా లోకేష్ అనుసరిస్తున్నారు.
ఇదేతనకు గుర్తింపు తెస్తుందని అనుకుంటున్నారు. అయితే.. యూత్‌లో ఆయన పై చర్చ జరుగుతున్నా.. దూకుడుకాకుండా.. ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలనేది యూత్ చెబుతున్న మాట. ప్రజలు ఫైర్ బ్రాండ్లను కోరుకోవడం లేదు. పైర్ ఉన్న నాయకులను మాత్రమే కోరుకుంటున్నారు. ఈ దిశగా నారా లోకేష్ దృష్టిపెడితే.. బాగుంటుందనేది సూచన. ఇప్పటి వరకు సాగిన యాత్ర ఫర్వాలేదనే రీతిలోనే సాగింది. భారీ ఎత్తున ప్రజలు కూడా వస్తున్నారు. కానీ, చిన్న చిన్న లోపాలు తప్పిస్తే.. మరింత బాగుంటుందని అంటున్నారు.